న్యూఢిల్లీ : దేశంలో త్రి భాషా సూత్రం అమలుకు రంగం సిద్ధమవుతున్నది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020 సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించిందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. 6వ తరగతి విద్యార్థులు మూడు భాషలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో రెండు కచ్చితంగా భారతీయ భాషలై ఉండాలి. అయితే ఈ కొత్త విధానంలో ఇంగ్లిష్‌ను విదేశీ భాషగా పరిగణిస్తారు.
ఇప్పటికే 6వ తరగతిలో ఆంగ్ల భాషను బోధిస్తున్నందున దీనిని విదేశీ భాషగా లెక్కకడతారు. వీటితో పాటు రెండు భారతీయ భాషలను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం 8వ తరగతి వరకే అమలవుతుందని పేర్కొంటున్నా, 9, 10 తరగతులకు కూడా కొనసాగుతుందని చెబుతున్నారు. అంటే 2031 నాటికి 10వ తరగతి బోర్డ్ పరీక్ష రాసే విద్యార్థులు మూడో భాషా పరీక్షను కూడా రాయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విద్యార్థులు రెండు భాషా పేపర్లకు మాత్రమే హాజరవుతున్నారు.