Satyendar Jain : ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) స్కాం కేసులో అరెస్టైన ఆప్ కీలక నేత సత్యేందర్ జైన్ సహా మరో ఆరుగురు నిందితులకు కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సత్యేందర్ జైన్‌తోపాటు డీజేబీ స్కాంలో నిందితులను జుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఇదే సమయంలో తన అరెస్టును సవాలు చేస్తూ సత్యేందర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
అయితే, రౌస్ రెవెన్యూ కోర్టులోనే నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని సూచించింది. ఈ బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను ఆగష్టు 25కు వాయిదా వేసింది. డీజేబీ స్కాంపై ఏసీబీ (యాంటీ కరప్షన్ బ్రాంచ్) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా కీలక నిందితులుగా ఉన్న సత్యేందర్ జైన్, బోర్డు మాజీ సీఈవో ఉదిత్ ప్రకాశ్ రాయ్‌తోపాటు ఇతర నిందితుల్ని మంగళవారం ఏసీబీ అరెస్టు చేసింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అంకిత్ శ్రీవాస్తవను కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. డీజేబీలో ఒక మురికి నీటి శుద్ధి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. దీంతో 2024 మేలో కేసు నమోదైంది. తన అరెస్టుపై సత్యేందర్ జైన్ మాట్లాడారు.
తన అరెస్టు రాజకీయ కుట్ర అని, త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల నేపథ్యంలోనే తనను ప్రభుత్వం అరెస్టు చేసిందని ఆరోపించారు. ఆయనను కోర్టుకు తీసుకెళ్తుండగా, మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. సత్యేందర్ జైన్.. పంజాబ్ ఆప్ కో ఇంచార్జిగా ఉన్నారు. సత్యేందర్ అరెస్టుపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ ఆదేశాల మేరకే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. గతంలో కూడా ఆయనను అరెస్టు చేసి, జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని, ఈ కేసు కూడా తప్పుడు కేసు అని తేలుతుందన్నారు. ప్రజలంతా సత్యేందర్‌కు మద్దతుగా ఉన్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.