హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : గురుకులాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెడితే, గురుకులాకు సరుకులను ఎలా సరఫరా చేస్తారని? పిల్లలకు నాణ్యమైన భోజనం ఎలా అందిస్తారని? ప్రశ్నించారు. గురుకులాల కాంట్రాక్టర్లు హరీశ్‌రావును ఆదివారం కలిశారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నదని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా హరీశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కల్తీ ఆహారంతో గురుకుల విద్యార్థులు దవాఖానల పాలై ప్రాణాలు వదులుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయమని, గురుకుల విద్యార్థులు పస్తులుండవద్దన్న బాధ్యతతో కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి మరీ భోజనాలు పెడుతున్నారని తెలిపారు. అప్పులు పెరిగి కాంట్రాక్టర్లు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారని వాపోయారు.
సుమారు 5000 మంది గురుకులాల కాంట్రాక్టర్లకు బతుకమ్మ, దీపావళి పండుగ సంబురం లేకుండా చేయడం దుర్మార్గమని హరీశ్ నిప్పులు చెరిగారు. అధికారులను కలిసి బిల్లులు చెల్లించాలని ఎన్నిసార్లు విన్నవించినా ఈ ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, గురుకుల పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని డిమాండ్ చేశారు.