మైకు కూత.. పంటకు రక్ష

- మాటలు రికార్డు చేసి.. చేలల్లో పెట్టి..
- అడవి జంతువులు, పక్షుల బారి నుంచి పంటను
- రక్షించుకునేందుకు అన్నదాతల కొత్త వ్యూహం
- రికార్డు మైక్సెట్లకు భలే గిరాకీ
రాత్రి పది గంటలైంది.. ఒకటే కూత.. సో..సో.. అంటూ గట్టిగా కేకలు వినిపిస్తున్నయ్.. ఢం ఢం అంటూ చప్పుళ్లు.. కేకలు.. బొబ్బలు.. అచ్చం మనిషి అరిచినట్టే.. ఊళ్లో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. ఎవరికి ఏమైందోనని ఆరా తీశారు.. అంతలోనే ఒకాయన వచ్చి “అది మా మక్క చేనులో మైకు కూత అని చెప్పిండు. మైకైతే ఒకలాగే అరవాలి కదా.. వింతగా అరుస్తుంది ఏంటీ..?” అంటూ ప్రశ్నించారు. అప్పుడే ఆ రైతు “నేను మా పంట పొలంలో అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు మైకు పెట్టి వచ్చాను. ఎలక్ట్రానిక్ సిస్టంలో చిప్ పెట్టి మనిషి ఏ రకంగా అరిస్తే ఆ రకంగా రికార్డు అవుతుంది. కేకలు వేసినట్లు.. సో.. సో.. అంటే గాయి చేసినట్టు.. మైకు పలుకుతుంది. పంట చేలో మధ్యలో ఎక్కడైనా మైకు బిగిస్తే చాలు అది చార్జి అయిపోయే వరకు అరుస్తూనే ఉంటుంది” అన్నాడు. వెంటనే వేరే రైతు “నా పంటపై కూడా అడవి పందులు దాడి చేశాయి. పంట నాశనమైంది. నేను కూడా తీసుకువస్త”నని మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేసి చేలో పెట్టాడు. అడవి జంతువుల బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని రైతులు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. - సోన్
నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే నిర్మల్, సోన్ మండలాల్లోని ఆయా గ్రామాల్లోని రైతులు తమకున్న పంట భూముల్లో మక్క, పల్లి, జొన్న, సజ్జ, గోధుమ పంటలతో పాటు కూరగాయలు, వరి పంటలను సాగు చేస్తున్నారు. పంట భూములు అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉండడంతో నిర్మల్ మండలంలోని మేడిపెల్లి, అనంతపేట్, డ్యాంగాపూర్, వెంగ్వాపేట్, భాగ్యనగర్, లోకల్ వెల్మల్, జాఫ్రాపూర్, సిద్దులకుంట, గాంధీనగర్, మాదాపూర్, కూచన్‌పెల్లి తదితర గ్రామాల్లో మైకులను వినియోగిస్తున్నారు. అర్ధరాత్రి వేళ అడవి జంతువులు పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు పంట చుట్టూ కంచెలతో పాటు పాత చీరలను కట్టి రక్షణగా ఉపయోగించుకుంటున్నారు. దీనికితోడు వలలు, సీసాకు రాయి కట్టి చప్పుళ్లు చేస్తున్నారు. అయినప్పటికీ జంతువుల బెడద తప్పడం లేదు.
మైక్సెట్ల వినియోగం..
అడవి జంతువుల బెడద తప్పకపోవడంతో రైతులు మైక్సెట్లను వినియోగిస్తున్నారు. మార్కెట్లో వివిధ ఓల్టేజీల్లో గల మైకుసెట్ల కంపెనీలను బట్టి రూ.450 నుంచి రూ.వెయ్యి వరకు ఉన్నాయి. ఒక్కసారి కొనుగోలు చేసి అందులో చిప్ పెట్టి రికార్డు బటన్ ఆన్ చేయాలి. పంట చేలో అడవి జంతువులను పారదోలేందుకు కేకలు, బొబ్బలు, కూతలు పెట్టాలి. అంతే అందులో రికార్డు కాగానే చిప్పెట్టి ఆన్ చేస్తే నాలుగైదు గంటల పాటు పంట చేలో కూత పెడుతూనే ఉంటుంది. ఒక్కసారి మైక్ బ్యాటరీ చార్జి కావడానికి రెండు గంటలు పడుతుంది. ఫుల్‌గా చార్జి చేస్తే పంట చేలో మనిషి లేకున్నా మనిషి మాదిరిగా ఐదు గంటల సేపు మైక్‌సెట్ తన పని కానిస్తుంది. దీనివల్ల అడవి జంతువులు పంట పొలంలో మనుషులు ఉన్నారనే భయంతో పంటలపై దాడి చేసేందుకు వచ్చి వెనుదిరిగిపోతున్నాయని వివిధ గ్రామాల రైతులు పేర్కొంటున్నారు.
గతంలో పడరానిపాట్లు..
మైక్‌సెట్ రాకముందు రైతులు పంటను కాపాడుకునేందుకు చేల చుట్టూ కట్టెలు, బ్యాటరీ సహాయంతో అర్ధరాత్రి వరకు తిరిగే పరిస్థితి ఉండేది. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సాధారణంగా పంటలపై జంతువులు సాయంత్రం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు దాడి చేస్తాయి. ఆ సమయంలోనే మైక్ సౌండ్ సిస్టం పెట్టేలా రైతులు చూస్తున్నారు.
పంట చేలకు వెళ్లే తిప్పలు తప్పింది..
నాకు రెండు ఎకరాల తోట ఉంది. మక్క, పల్లి, కూరగాయల పంటలు వేశా. పంట మొలకెత్తగానే అడవి పందులు దాడి చేశాయి. వాటి రక్షణకు మొదట చుట్టూ కంచె పెట్టిన. చీరలు చుట్టినా లాభం లేకుండా పోయింది. కొత్త మైక్ సిస్టం ద్వారా పందులను తరిమికొట్టవచ్చని చెబితే విన్నా. రూ.600 పెట్టి మైక్‌సెట్ కొనుగోలు చేశా. ప్రతిరోజూ చిప్‌లో మాటలు రికార్డు చేసి పంట చేలకు వెళ్లి అమర్చి వస్తున్నా. ఇప్పుడు అడవి జంతువులు పంట చేలకు రావడం లేదు. రాత్రి వేళల్లో పంట చేలకు వెళ్లే బాధ తప్పింది.
- బద్దం రాజు, రైతు(బొప్పారం, సోన్ )
ఎట్లా మాట్లాడితే అట్ల సౌండ్ వస్తుంది..
మాది చిట్యాల్ గ్రామం. నేను ప్రస్తుతం మక్క, పసుపు, కంది, వేరుశనగ పంటను సాగు చేస్తున్నా. గతంలో పంట రక్షణకు రాత్రి వేళ ప్రతిరోజూ వెళ్లేవాణ్ణి. నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడవి పందులు దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మైకు సిస్టం రావడంతో రైతులంతా దీన్ని ఉపయోగిస్తున్నారు. పందులు ఒక చేను నుంచి ఇంకొక చేనుకు రావడం లేదు. మైక్సౌండ్ ఐదు గంటల పాటు పని చేయడంతో అడవి జంతువుల బెడద తప్పింది.
- సాయారెడ్డి, రైతు(చిట్యాల్, నిర్మల్)
తాజావార్తలు
- హైదరాబాద్‌లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన
- రా రమ్మంటాయి..ఆనందాన్నిస్తాయి
- కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?
- చంపేస్తామంటూ హీరోయిన్‌కు బెదిరింపు కాల్స్..!
- అమెరికా అధ్యక్షుడు ఫాలో అవుతున్న ఆ ఏకైక సెలబ్రిటీ ఎవరో తెలుసా?
- బైడెన్‌కు ఆ "బిస్కెట్" ఇవ్వకుండానే వెళ్లిపోయిన ట్రంప్
- ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
- ఎస్బీఐ పీఓ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్‌కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క