మరికల్, సెప్టెంబర్ 9 : రైతులకు యురియా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. నిత్యం యురియా కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదని రైతులు కన్నీరుపెడుతున్నారు. మంగళవారం మరికల్‌కు 900 బస్తాల యురియా రావడంతో రైతు వేదిక వద్ద రైతులు ఉదయం నుంచి క్యూలో నిల్చున్నారు. పోలీసు బందోబస్తు మధ్య టోకెన్లు అందజేసి యూరియా పంపిణీ చేపట్టారు. కాగా పెద్దచింతకుంటకు చెందిన మహిళా రైతు బ్యాగరి సరిత క్యూలైన్లో సొమ్మసిల్లి పడిపోయింది. పక్కనున్న రైతులు ఆమెకు నీరు తాగించి కొద్దిసేపు చెట్టుకింద కూర్చొబెట్టారు. అనంతరం అధికారులు రైతులకు మార్కర్‌తో గోరుపై గుర్తు వేసి మరీ యూరియా పంపిణీ చేశారు.
మహిళా రైతుల ఆందోళన
అచ్చంపేటరూరల్, సెప్టెంబర్ 9 : రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియా అందకపోడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాలకుల తీరుపై మండిపడుతున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులకు యూరియా అందకపోడవంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన మహిళ రైతులు నడిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఐ నాగరాజు అనుమతిలేకుండా ధర్నాలు, నిరసనలు చేయవద్దని రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.
తిమ్మాజిపేటలో రాస్తారోకో
తిమ్మాజిపేట, సెప్టెంబర్ 9 : యురియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తగినంత యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తిమ్మాజిపేటలో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సకాలంలో యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. కాగా తిమ్మాజిపేటకు 200 బస్తాల యూరియా రాగా 400 మందికి టోకెన్లు ఇవ్వడంతో 200 మందికి ఒక్కో బస్తా పంపిణీ చేయగా మిగిలిన వారికి యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.