కొల్లాపూర్ : నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం కొల్లాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ విద్యార్థులతో మమేకమై మంచిగా చదువుకోవాలని ఏరోజు పాఠాన్ని ఆరోజు పూర్తిగా వచ్చేంతవరకు నేర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు మెరుగయ్యే విధంగా ఉపాధ్యాయులు బోధన అందించాలన్నారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. భోజనం బాగుంటుందా మెనూ ప్రకారం పెడుతున్నారని కలెక్టర్ విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులకు వండిన భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించి, అందులో ఉపయోగిస్తున్న పదార్థాల నాణ్యతను కూడా తనిఖీ చేశారు. భోజన సరఫరా విధానం, వంటగది నిర్వహణ, నిల్వ సదుపాయాలను పర్యవేక్షించారు. పాఠశాలలోని పలు విభాగాలను, సదుపాయాలను, పరిశీలించారు. కలెక్టర్, విద్యార్థుల సంఖ్యను, వారికి అందజేస్తున్న ఆహారం వివరాలను ప్రిన్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటించడంలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
బియ్యం నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. వంటగదిని ప్రతిరోజూ పూర్తిగా శుభ్రం చేయాలని సూచించారు. తనిఖీల సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ ఈ అంశాలను విని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు, వారి చదువు, అవసరాలు, సదుపాయాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.
పాఠశాలలో ఉన్న సమస్యలను సమగ్రంగా పరిశీలించి, పూర్తి నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్‌కు ఆదేశించారు. రోజువారీ పర్యవేక్షణలో భాగంగా పాఠశాలలోని సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సందర్శన ముగిసిన అనంతరం విద్యార్థినిలతో కలిసి సహపంక్తి విద్యార్థినిలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.