దోహా: ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం పేలుళ్ల శబ్దాలు కలకలం రేపాయి. హమాస్ సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకొని తామే ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దాడులు చేసిన ప్రదేశాల వివరాలను వెల్లడించలేదు. హమాస్ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా ఈ దాడిలో చనిపోయాడని అల్ అరేబియా తెలిపింది.
దాడికి ముందు యుద్ధంతో సంబంధం లేని వారికి కలిగే హానిని తగ్గించడానికి నిఘా వర్గాల సమాచారం ప్రకారం చర్యలు తీసుకున్నట్టు ఇజ్రాయెల్ వైమానిక దళం తెలిపింది. ఇజ్రాయెల్ దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిచర్య అని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. ఇజ్రాయెల్ అనాలోచిత చర్యలను సహించబోమని హెచ్చరించింది.