MLA Medipalli Satyam | గంగాధర, నవంబర్ 22 : మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మధురానగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు మహిళలకు చీరలను అందజేశారు. అలాగే మండలంలోని గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ. 31,03,596ల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులు, 34 మంది లబ్ధిదారులకు రూ.8,57,500ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మహిళలే కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ వారి ఆత్మ గౌరవానికి తోడ్పాటున అందిస్తుందని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతీ ఆడపడుచుకు ఇందిరా మహిళా శక్తి చీరను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా చేనేత కార్మికులకు చేతినిండా ఉపాధి దొరికిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన నాణ్యమైన చీరలను చూసి ఆడపడుచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమల్ల మనోహర్,మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.