Maida Flour | ఈ ఆధునిక యుగంలో చాలా మంది ఇంట్లో తయారు చేసిన ఆహారాల కన్నా బయట ఫుడ్స్‌నే ఎక్కువగా తింటున్నారు. అయితే అక్కడి వరకు బాగానే ఉన్నా చాలా మంది జంక్ ఫుడ్‌ను తింటున్నారు. జంక్ ఫుడ్‌కు అలవాటు పడిన ప్రజలు ఆ ఫుడ్స్‌ను తినకుండా ఉండలేకపోతున్నారు. గతంలో జంక్ ఫుడ్‌ను చాలా తక్కువగా తినేవారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఫుడ్ రీల్స్‌ను చూసి చాలా మంది జంక్ ఫుడ్ ఎక్కడ లభిస్తుందో తెలుసుకుని మరీ తింటున్నారు. అయితే ఈ రకమైన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్‌ను అధికంగా తినడం మంచిది కాదని వారు సూచిస్తున్నారు. బయట మనం తినే అధిక శాతం ఆహారాల్లో చాలా వరకు మైదా కలుస్తుందని, ఇది మన ఆరోగ్యానికి ఎంతో కీడు చేస్తుందని అంటున్నారు. మైదా పిండి కలిసిన ఆహారాలను తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
మైదా పిండి మనకు చాప కింద నీరులా అనేక రోగాలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. మైదా పిండితో తయారు చేసిన వంటకాలు రుచిగానే ఉంటాయి. కానీ వాటిని తరచూ తినడం మంచిది కాదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా వరకు ప్రాసెస్ చేయబడిన ఆహారాలతోపాటు బయట లభించే అనేక రకాల ఆహారాల్లో మైదా పిండిని అధికంగా ఉపయోగిస్తున్నారు. మైదా పిండి అంటే రీఫైన్ చేయబడిన పిండి అని అర్థం. ఇందులో ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ పిండిని ఎక్కువగా రోటీలు, పూరీ, చపాతీ, బేకరీ ఐటమ్స్ వంటి ఆహారాల్లో ఉపయోగిస్తున్నారు. అందుకనే ఈ ఆహారాలు టేస్టీగా ఉంటాయి. కానీ పోషక విలువలు అసలు ఉండవు. కనుక అలాంటి ఆహారాలను తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మైదా పిండి తెల్లగా ఉంటుంది. ఎందుకంటే గోధుమ పిండిని బాగా ప్రాసెస్ చేసి రీఫైన్ చేసి దాన్ని తయారు చేస్తారు. కనుకనే మైదా పిండి తెల్లగా వస్తుంది.
ఇక మైదా పిండి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా అధికంగా ఉంటుంది. ఇది ఏకంగా 71 వరకు ఉంటుంది. అంటే ఈ పిండితో తయారు చేసిన ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయన్నమాట. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఏమాత్రం మంచిది కాదు. ఇక ఆరోగ్యవంతమైన వారు కూడా మైదా పిండితో తయారు చేసిన ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు అధికంగా ఉంటాయి. కనుక దీర్ఘకాలంలో ఈ పిండి డయాబెటిస్ వచ్చేలా చేస్తుంది. అలాగే మైదా పిండిని తినడం వల్ల శరీరంలో కొవ్వు అధికంగా చేరుతుంది. దీని వల్ల అధికంగా బరువు పెరుగుతారు. ఇక ఈ పిండిని అధికంగా తింటే క్యాన్సర్ కు కారణం అవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.
మైదా పిండిని రుమాలీ రోటీ, నాన్, కేకులు, రొట్టెలు, కాల్చిన ఆహారాలు, బిస్కెట్లు, స్నాక్స్, పాస్తా, నూడుల్స్, సమోసాలు వంటి ఆహారాల్లో ఉపయోగిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే మైదా పిండి కలిసే ఆహారాల జాబితా చాంతాడంత అవుతుంది. కనుక మీరు ఆహారాలను ఎక్కువగా బయట తింటుంటే మైదా లేని వాటిని తినడం మంచిది. లేదంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, రహదారుల పక్కన చిరు వ్యాపారులు, బేకరీల్లో తయారు చేసే ఆహారాల్లో మైదా పిండిని అధికంగా ఉపయోగిస్తున్నారు. కనుక ఇలాంటి చోట్ల ఆహారాలను మీరు తింటుంటే జాగ్రత్తగా ఉండాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది తెల్లని విషంగా మారిందని, తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలగజేస్తుందని అంటున్నారు. మైదా పిండి కలిసిన ఫుడ్స్‌ను తినడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. దీని వల్ల మెటబాలిజం మందగిస్తుంది. అధికంగా బరువు పెరుగుతారు. ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు కారణం అవుతుంది. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఇలా మైదా పిండి అన్ని రకాలుగా మనకు కీడు చేస్తుంది, కనుక దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.