KTR | సర్పంచ్ ఎన్నికలు అయిన వెంటనే పార్టీని బలోపేతం చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. న్నికలు అయిన వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. అలాగే గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలు వేసుకుందామని.. క్యాడర్ను గట్టిగా చేసుకుందామని చెప్పారు. జిల్లా కార్యాలయాల్లో కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బకు ఒక మంత్రి పదవి వచ్చిందని తెలిపారు. రేవంత్ రెడ్డి కూడా గల్లీగల్లీ కూడా తిరిగి ప్రచారం చేసిండని అన్నారు. చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగిలినా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి లేదని అన్నారు.
మన పార్టీ నాయకుల అనైక్యతతోనే ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. మనం చేసిన పనులు సరిగ్గా చెప్పుకోలేదని తెలిపారు. సోషల్మీడియాలో చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93వేల కోట్ల ఖర్చు అయ్యిందని.. కానీ రాహుల్ గాంధీ వచ్చి రూ.లక్ష కోట్ల కుంభకోణం అంటే ప్రజలు నమ్మారని అన్నారు. ప్రజలు ఆరు గ్యారంటీల గారడిలో పడి మోసపోయారని తెలిపారు. కల్వకుర్తిలో ఆస్పత్రి లేదని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతున్నాడని.. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ బాధ్యుడా అని నిలదీశారు.
420 హామీలను కాంగ్రెస్ నాయకులు తుంగలో తొక్కారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు ఏం చేశావని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తే ఫ్రీ బస్సు అంటున్నాడని తెలిపారు. మహిళలకు ఫ్రీ అంటూ పురుషులకు డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతుబంధు ఎగ్గొట్టేసరికి కేసీఆర్ గుర్తుకొచ్చిండు అని కేటీఆర్ అన్నారు. ఏ ఊళ్లో అయినా పది మంది గుమిగూడితే.. తొందరగా కేసీఆర్ను తెచ్చుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.