హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా మహబూబ్ పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉన్న ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఒకటే వార్డులో ఉంటే, మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. కాగా, జిల్లాలోని కేసముద్రం మండలం మహమూద్‌పట్నంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లో విచిత్రం చోటుచేసుకుంది.
ఈ గ్రామంలో మూడు ఎస్టీ కుటుంబాలకు చెందిన ఏడుగురు ఓటర్లుండగా, వారికి సర్పంచ్‌తో పాటు మూడు వార్డులు కేటాయించారు. దీంతో రిజర్వేషన్లు మార్చాలని గ్రామానికి చెందిన మిట్టగుడుపుల యాకూబ్, కాసోజు శ్రీకాంతాచారి, సిలువేరు లింగయ్య, పోలు నాగయ్య, విజయ్, వెంకటమల్లు తదితరులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మహమూద్‌పట్నం గ్రామ పంచాయతీ నుంచి తండాలను వేరు చేసి కొత్త జీపీలు ఏర్పాటు చేసిన అనంతరం గ్రామంలో 576 ఓట్లు ఉన్నట్లు వారు తెలిపారు.
199 మంది ఎస్సీలు, 358 మంది బీసీలు, 13 మంది ఓసీలు, ఏడుగురు ఎస్టీలు ఓటు హక్కును కలిగి ఉన్నారని, అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంతో సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డులు దక్కాయి. అయితే రెండు కుటుంబాలకు చెందిన వారు సమీప బంధువులు కాగా, ఎవరు ఏ పదవులకు, ఏ పార్టీ నుంచి పోటీచేస్తారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై హైకోర్టు పై విధంగా స్పందించింది.