PV Sindhu | గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. మంగళవారం (మార్చి 3) నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆమె తన బృందంతో కలిసి లండన్‌కు బయలుదేరగా, ఆకస్మికంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఈ అంతరాయం ఏర్పడింది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్ దేశాల్లో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా నిలిపివేయడంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడే నిలిచిపోయారు. ఈ పరిణామాల మధ్య సింధు కూడా విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.
విమానాశ్రయంలో ఉన్న పరిస్థితులను సింధు సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) ద్వారా పంచుకున్నారు. “పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆకాశంలో క్షిపణులను అడ్డుకుంటున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎంతో ఇష్టమైన దుబాయ్ నగరం ఇలా యుద్ధ నీడలో ఉండటం బాధాకరం. ఎన్నో కుటుంబాలు ఎక్కడికక్కడ ఆగిపోయి, ఎప్పుడు ఇంటికి వెళ్తామా అని ఎదురుచూస్తున్నారు. ఈ కష్టకాలం త్వరగా ముగియాలని కోరుకుంటున్నాను. మేమంతా ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నాం” అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా సహా పలు అంతర్జాతీయ విమాన సంస్థలు గల్ఫ్ దేశాలకు సర్వీసులను రద్దు చేశాయి.
పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునే వరకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సింధు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నమెంట్లో పాల్గొనగలరా లేదా అన్నదానిపై అనిశ్చితి నెలకొంది.