న్యూఢిల్లీ: కెనడాలో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై స్టడీ పర్మిట్ దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితిపై మరింత లోతైన తనిఖీలు చేపట్టనున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల వద్ద ఎంత మొత్తం ఉందన్న విషయంతో పాటు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
నూతన నిబంధనల ప్రకారం కనీన నిధుల నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే సూచించిన ధనానికి సంబంధించిన స్పష్టమైన ఆధారం చూపడం తప్పనిసరి చేశారు. దరఖాస్తుదారులు తమ ఆదాయ వనరులు, ఉద్యోగ వివరాలు, బ్యాంకు ఖాతాల లావాదేవీలకు సంబంధించిన కనీసం ఆరు నెలల చరిత్రను సమర్పించాల్సి ఉంటుంది.
ఆ డబ్బు చట్టబద్ధమైన మార్గాల ద్వారా సమకూరిందా లేదా అని అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తారు. ఆఖరి నిమిషంలో నిధులను సమకూర్చుకోవడం కాకుండా, ముందుగానే ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.