మాస్కో, ఆగస్టు 5: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. యుద్ధంలో వేలాది మంది సైనికులు కన్నుమూస్తున్నారు. అయితే ఇదే సమయంలో రష్యాలో ‘బ్లాక్ విడోస్’ అనే కొత్త తరహా కుంభకోణం బయటపడింది. సైన్యంలో చేరిన వారు మరణించిన తర్వాత భారీ ప్రభుత్వ పరిహారాన్ని పొందేందుకు వారిని కొందరు మహిళలు బూటకపు వివాహాలు చేసుకుంటున్నారు.
వీరిని ‘బ్లాక్ విడోస్’ గా పేర్కొంటున్నారు. ఈ ధోరణి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించడమే కాకుండా యుద్ద సమయంలో క్రెమ్లిన్ అనుసరిస్తున్న విధానాలపై మరోసారి విమర్శలకు దారితీసింది. సీఎన్ఎన్ కథనం ప్రకారం యుద్ధానికి వెళ్లే కొద్ది రోజుల ముందు బలహీనమైన సైనికులకు కొందరు హడావిడిగా పెండ్లిండ్లు చేసి, వారి కొత్త జీవిత భాగస్వాములను చట్టబద్ధమైన వారసులుగా మారుస్తున్నారు.
ఒక వేళ ఆ సైనికులు యుద్ధంలో మరణిస్తే వారికి అసలైన వారసులుగా వీరిని పేర్కొంటూ ఆ పరిహారం అక్రమంగా పొందుతున్నారు. దీని కారణంగా సైనికుల సొంత కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. సైనికులు మరణిస్తే వారికి కనీసం రూ. 64 లక్షలు పరిహారంగా లభిస్తుంది. దీని కోసం ‘బ్లాక్ విడోస్’ రంగప్రవేశం చేస్తూ ఇలా అసలైన సైనిక కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు.