HYDRAA | హైదరాబాద్ బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.
బతుకమ్మ కుంట పరిధిలోని కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేటు స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని జూన్ 12వ తేదీన హైకోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించారని ఆయనపై ఎ.సుధాకర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకురాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. తాజాగా బుధవారం నాడు ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. రంగనాథ్ హాజరుకాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చే సింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.
బతుకమ్మ కుంటతో పాటు గతంలోనూ తమ ఆదేశాలను పాటించలేదని హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రాకు వ్యతిరేకంగా రోజుకు 10 పిటిషన్ల వరకు వస్తున్నాయని పేర్కొంది. ప్రజలను బాధించేవి కాకుండా.. వారికి మంచి జరిగే పనులు చేయాలని ఆదేశించింది.