వికారాబాద్, ఫిబ్రవరి 28 : నన్ను క్షమించు అమ్మ.. అని లెటర్ రాసి ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాయిబాబాకాలనీకి చెందిన బసవరాజ్ హోంగార్డుగా పనిచేసి ఆరేండ్ల క్రితం మరణించాడు. అతని మూడో కుమార్తె బలిజ దివ్య (26) 2020వ బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఐదేండ్లుగా వికారాబాద్ జిల్లా ధారూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బలిజ దివ్య మృతదేహం వద్ద సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘ప్రియమైన అమ్మ, నా కుటుంబసభ్యులు నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు. మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేక ఈ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నా. అమ్మా.. నీకు నేను భారం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా. నాన్న ఉంటే బాగుండే అమ్మ. నాన్న లేనందుకే నీకు ఇన్ని కష్టాలు. నన్ను క్షమించు అమ్మా’ అని రాసి ఉంది. బలిజ దివ్య ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.