KTR | రాజకీయాల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కల్వకుర్తిలో ఎన్టీఆర్ కూడా ఓడిపోయారని ఆయన గుర్తుచేశారు. అసలు యుద్ధం 2028లో ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజల సమక్షంలో బయటపెడుదామని పిలుపునిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరిగాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బానిసత్వం లేని ఒకే ఒక్క పార్టీ గులాబీ పార్టీ అని తెలిపారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు కేసీఆర్ సాగునీరు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి 660 మీటర్ల ఎత్తు ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను కేసీఆర్ చేపట్టారని అన్నారు. గొలుసుకట్టు రిజర్వాయర్లను 90 శాతం పనులు పూర్తి చేశారని తెలిపారు. ఒక పంపును కూడా కేసీఆర్ ప్రారంభించారని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు.
కరెంట్ కష్టాలతో ఎంతమంది చనిపోయారో మీకంతా తెలుసని కేటీఆర్ గుర్తుచేశారు. వైఎస్ హయాంలో ఉచిత కరెంట్ ఇచ్చినా.. ఆరు గంటలే ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో దొంగలు కొట్టే సమయంలో కరెంటు ఇచ్చేవారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు రాలేదని రేవంత్ రెడ్డే చెప్పాడని అన్నారు. కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ, సాగునీరు తెచ్చుకున్నామని తెలిపారు. రైతుకు పెట్టుబడి రూ.73 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు.
మన పార్టీ నాయకుల అనైక్యతతోనే ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. మనం చేసిన పనులు సరిగ్గా చెప్పుకోలేదని తెలిపారు. సోషల్మీడియాలో చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93వేల కోట్ల ఖర్చు అయ్యిందని.. కానీ రాహుల్ గాంధీ వచ్చి రూ.లక్ష కోట్ల కుంభకోణం అంటే ప్రజలు నమ్మారని అన్నారు. ప్రజలు ఆరు గ్యారంటీల గారడిలో పడి మోసపోయారని తెలిపారు. కల్వకుర్తిలో ఆస్పత్రి లేదని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతున్నాడని.. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ బాధ్యుడా అని నిలదీశారు.
420 హామీలను కాంగ్రెస్ నాయకులు తుంగలో తొక్కారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు ఏం చేశావని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తే ఫ్రీ బస్సు అంటున్నాడని తెలిపారు. మహిళలకు ఫ్రీ అంటూ పురుషులకు డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతుబంధు ఎగ్గొట్టేసరికి కేసీఆర్ గుర్తుకొచ్చిండు అని కేటీఆర్ అన్నారు. ఏ ఊళ్లో అయినా పది మంది గుమిగూడితే.. తొందరగా కేసీఆర్ను తెచ్చుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.