Supreme Court : ఆన్లైన్ కంటెంట్ (Online Content) నియంత్రణపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా (Social Media) లో అప్లోడ్ చేసే కంటెంట్‌కు ఎవరో ఒకరు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కొందరు వ్యక్తులు సొంతంగా ఛానెళ్లు ప్రారంభించి, ఆ తర్వాత బాధ్యతారాహిత్యంగా ఉండటం వింతగా అనిపిస్తున్నదని సీజేఐ (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) అన్నారు.
యూట్యూబర్ రణ్వీర్ అలహబాదియా కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ కామెడీ షోలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రశ్నించిన ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహబాదియా వివాదంలో చిక్కుకున్నారు. అందుకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
ఇది కేవలం అశ్లీలతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, సోషల్ మీడియాలో యూజర్స్ జనరేట్ చేస్తున్న కంటెంట్‌లోని లోపాలను ఇది ఎత్తిచూపుతున్నదని మెహతా వ్యాఖ్యానించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఓ అమూల్యమైన హక్కు అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే హక్కుకు వక్ర భాష్యం చెప్పడం సరికాదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనతో సీజేఐ ఏకీభవించారు. ఇదే అసలు సమస్య అని, నా ఛానెల్ నా ఇష్టం అన్నట్లుగా యూట్యూబర్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇది సరికాదని, ఆన్లైన్ కంటెంట్ విషయంలో ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు. అసభ్యకర కంటెంట్‌ను అప్లోడ్ చేసినప్పుడు అధికారులు చర్యలు తీసుకునేలోపే అది వైరల్‌గా మారుతుందని, అప్పటికే లక్షల మంది వీక్షిస్తున్నారని, అలాంటప్పుడు దాన్ని ఎలా నియంత్రిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. యూజర్స్ సృష్టించిన సోషల్ మీడియా కంటెంట్‌ను నియంత్రించేలా నాలుగువారాల్లో నిబంధనలను తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.