నార్నూర్ : ఏజెన్సీ ప్రాంతంలోని ( Agency Area ) ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు (Tribal students) అన్యాయం జరిగితే సహించేది లేదని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావ్ ( Dadi rao) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల వద్ద గురువారం ఆయన మాట్లాడారు. కేజీబీవీ ( KGBV ) పాఠశాలలో సమస్యలతో పాటు నాణ్యమైన భోజనం వడ్డించడం లేదని ఆరోపించారు.
ఇటీవల భోజనంలో పురుగులు రావడం బాధాకరమని అన్నారు. ఈ విషయంపై ఆదివాసి సంఘాల నాయకులు పాఠశాలకు వెళ్లి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుందామంటే పాఠశాల ప్రత్యేక అధికారి హిమబిందు అనుమతి లేదని తిప్పిపంపడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. అన్నంలో పురుగులు వస్తే పట్టించుకోవద్దా అంటూ ప్రశ్నించారు. జిల్లా ఉన్నత అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.
జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీసీడీవోను సస్పెండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్, మండల అధ్యక్షుడు అర్కా గోవింద్, మాజీ సర్పంచ్ ఆత్రం పరమేశ్వర్, మేస్రం మోతిరామ్ తదితరులున్నారు.