మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 11: ప్రభుత్వ దవాఖానలో తీవ్ర జ్వరంతో (Fever)ఐదు సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం పెద్దంపేటకు చెందిన బొడ్డు రాజేందర్, రమ్య దంపతులకు ఐదేండ్ల బాబు, మూడేండ్ల పాప ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు.
కాగా, కొడుకు బొడ్డు అనిరుధ్ (5) కు గత మూడు రోజులు క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో లక్షెట్టిపేటలో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. వైరల్ జ్వరం అని తెలుసుకొని అక్కడ వైద్యం అందించి ఇంటికి తీసుకెళ్లారు. బుధవారం రాత్రి తీవ్ర జ్వరంతో పాటు విరోచనాలు కావడంతో గురువారం ఉదయం మంచిర్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. ఇక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలో బాబు మృతి చెందాడు. అనిరుధ్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.