Acer Nitro V 15 | గేమింగ్ ప్రియులు, కంటెంట్ క్రియేటర్ల కోసం ఏసర్ సంస్థ ఓ నూతన ల్యాప్ టాప్‌ను విడుదల చేసింది. నైట్రో వి15 పేరిట ఈ ల్యాప్‌టాప్‌ను భారత్‌లో విడుదల చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ రేంజ్లో తక్కువ ధరకే ఈ ల్యాప్‌టాప్‌ను వినియోగదారులకు అందిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, క్రియేటర్ల కోసం ఈ ల్యాప్ టాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఆబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్లో లాంచ్ చేశారు. 2.1 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఎక్కువ కాలం మన్నేలా ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. దీనికి గాను ఆంబర్ బ్యాక్లిట్ కీబోర్డును అందిస్తున్నారు. 15.6 ఇంచుల డిస్ప్లే ఉంది. దీనికి ఫుల్ హెచ్డీ రిజల్యూషన్‌ను, 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
ఈ ల్యాప్‌టాప్‌లో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7-13620హెచ్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఎన్వీడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5060 గ్రాఫిక్ కార్డు కూడా ఉంది. అందువల్ల క్రియేటర్లు చాలా సులభంగా 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌కు గాను డ్యుయల్ ఫ్యాన్, డ్యుయల్ ఇన్‌టేక్, డ్యుయల్ ఎగ్జాస్ట్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఎక్కువ సేపు దీన్ని ఉపయోగించినప్పటికీ ల్యాప్ టాప్ అంత త్వరగా హీట్ కు గురి కాదు. ఈ ల్యాప్‌టాప్‌కు ప్రత్యేకంగా నైట్రో సెన్స్ కీని అందిస్తున్నారు. అందువల్ల రియల్‌టైమ్‌లో ల్యాప్ టాప్ పెర్ఫామెన్స్, ఫ్యాన్ స్పీడ్, పవర్ ప్లాన్స్ వంటి విషయాలను తెలుసుకోవచ్చు.
ఈ ల్యాప్ టాప్‌లో 2టీబీ ఎస్ఎస్డీ లభిస్తుంది. 32జీబీ వరకు ర్యామ్‌ను పొందవచ్చు. వైఫై 6 సదుపాయం కూడా ఉంది. యూఎస్బీ టైప్ సి థండర్ బోల్ట్ 4 పోర్టును ఇచ్చారు. కనుక డేటాను వేగంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే చార్జింగ్ కూడా వేగంగా అవుతుంది. హెచ్డీఎంఐ పోర్టును, యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్టులను ఈ ల్యాప్ టాప్కు ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ విండోస్ కు చెందిన ఏఐ టూల్స్ కోసం ప్రత్యేకంగా కో పైలట్ కీని ఏర్పాటు చేశారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ల్యాప్ టాప్‌లో లభిస్తుంది. ప్యూరిఫైడ్ వాయిస్ ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్, ప్యూరిఫైడ్ వ్యూ ఏఐ వెబ్ క్యామ్ ఎన్హాన్స్మెంట్స్, వీడియో కాల్స్ కోసం ఆటో ఫ్రేమింగ్, బ్యాక్ గ్రౌండ్ బ్లర్, డీటీఎస్ సౌండ్ వంటి అద్భుతమైన ఫీచర్లను ఈ ల్యాప్ టాప్‌లో అందిస్తున్నారు.
ఏసర్ నైట్రో వి15 ల్యాప్ టాప్కు చెందిన ఐ5 మోడల్ ధర రూ.89,999 గా ఉండగా, ఐ7 మోడల్ ధర రూ.99,999గా ఉంది. ఈ ల్యాప్ టాప్‌ను ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు, ఏసర్ ఆన్ లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్ టాప్ ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉంది.