Oscar 2026 | అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఒకే విభాగంలో రెండు సినిమాలు సమానంగా నిలిచి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాయి. దీంతో డాల్బీ థియేటర్లో జరిగిన వేడుకలో ఈ సంఘటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం’ కేటగిరీలో ‘ది సింగర్స్’ మరియు ‘టు పీపుల్ ఎక్స్చేంజ్ సలైవా’ చిత్రాలు సంయుక్తంగా విజేతలుగా ప్రకటించబడ్డాయి. ఈ అవార్డును ప్రకటించడానికి ప్రజెంటర్ కుమాయిల్ నంజియాని స్టేజ్‌పైకి వచ్చారు. అయితే ఎన్వలప్ తెరిచిన తర్వాత కొద్దిసేపు ఏమీ చెప్పకుండా ఉండడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.
కొద్దిసేపటి తర్వాత ఆయన ఈ కేటగిరీ టై అయిందని, ఇద్దరు విజేతలు అవార్డును గెలుచుకున్నారని ప్రకటించారు. దీంతో డాల్బీ థియేటర్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ఆస్కార్ చరిత్రలో ఇలా ఒకే విభాగంలో ఇద్దరు విజేతలు రావడం ఇది ఏడోసారి కావడం విశేషం. అంతేకాకుండా 2012 తర్వాత మళ్లీ ఈ తరహా టై నమోదు కావడం ఇదే మొదటిసారి. అవార్డు ప్రకటించిన తర్వాత కుమాయిల్ నంజియాని సరదాగా స్పందిస్తూ, షార్ట్ ఫిలిం అవార్డు ఇవ్వడానికి ఇప్పుడు రెట్టింపు సమయం పడుతుంది అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఇదే సమయంలో కార్యక్రమ హోస్ట్ కోనన్ ఓబ్రియన్ కూడా చమత్కరించారు. ఈ టై వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ ఫలితాలపై బెట్టింగ్ చేసిన 22 మిలియన్ల మంది పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి అని వ్యాఖ్యానించడంతో థియేటర్ మొత్తం నవ్వులతో మార్మోగింది.
ఆస్కార్ చరిత్రలో టై అయిన సందర్భాలు
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ఒకే కేటగిరీలో ఇద్దరు విజేతలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం ఏడు సార్లు మాత్రమే ఇలా జరిగింది.
1932 – ఉత్తమ నటుడు (వాలెస్ బీరీ, ఫ్రెడ్రిక్ మార్చ్)
1949 – బెస్ట్ డాక్యుమెంటరీ (ఏ ఛాన్స్ టు లివ్, సో మచ్ ఫర్ సో లిటిల్)
1968 – ఉత్తమ నటి (కేథరిన్ హెప్బర్న్, బార్బరా స్ట్రీసాండ్)
1986 – బెస్ట్ ఫీచర్ డాక్యుమెంటరీ (ఆర్టీ షా: టైమ్ ఈజ్ ఆల్ యూ హావ్ గాట్, డౌన్ అండ్ అవుట్ ఇన్ అమెరికా)
1994 – బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం (ఫ్రాంక్ కాఫ్కాస్ ఇట్స్ ఏ వండర్ ఫుల్ లైఫ్, ట్రెవర్)
2012 – ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ (స్కైఫాల్, జీరో డార్క్ థర్టీ)
2026 – బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం (ది సింగర్స్, టు పీపుల్ ఎక్స్చేంజ్ సలైవా)
మొత్తానికి ఆస్కార్ 2026 వేడుకల్లో జరిగిన ఈ అరుదైన సంఘటన ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. ఒకే కేటగిరీలో రెండు సినిమాలు విజేతలుగా నిలవడం సినీ ప్రపంచంలో అరుదైన ఘట్టంగా నిలిచింది.