అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో శాసన సభలో నల్ల బ్యాడ్జీలు ధరించి, నిల్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతున్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆందోళన చేపట్టారు.
ఈ సమావేశాల్లో ఆరు గ్యారెంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. అయితే, సాధ్యమైనంత తొందరగా అసెంబ్లీ సమావేశాలను ముగించాలన్న ఆలోచనతో అధికార పక్షం కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తున్నది. గరిష్ఠంగా 10 పని దినాల్లోనే సభను ముగించాలని అధికార పక్షం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులోనే గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం, రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం, ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించడం తదితర అంశాలను పూర్తిచేయాల్సి ఉంటుంది.