హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పరాయి వలస పాలన కోరల నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించుకున్నదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేరొన్నారు. దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురసరించుకొని రాష్ట్ర, దేశ ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల నిస్వార్థ పోరాట స్ఫూర్తి, నాటి నేతల దార్శనిక నాయకత్వం, సకల జనుల త్యాగపూరిత భాగస్వామ్యమే భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించాయని కేసీఆర్ స్మరించుకున్నారు. 79 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకొని, 80వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో.. దేశంలో సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతి ఎంతవరకు సాధ్యమయ్యాయో ప్రతి ఒకరూ పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని, మరింత ముందడుగు వేయడానికి ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం అందించిన ఫెడరల్ విధానాలను కాపాడుకోవాలని కోరారు. సెక్యులర్ స్ఫూర్తిని పరిరక్షిస్తూ దేశ సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశ పాలనారథాన్ని ముందుకు నడిపించేది నేటి తరమేనని స్పష్టం చేశారు. యువత మరింత జ్ఞానం, సహనం, స్పష్టమైన దార్శనికతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలా అడుగులు వేసినప్పుడే మహనీయుల స్వాతంత్య్రోద్యమ త్యాగాల ఫలాలు సమాజంలోని ప్రతి ఒకరికీ, ప్రతి గడపకూ చేరుతాయని పేర్కొన్నారు.