అర్వపల్లి, సెప్టెంబర్ 11 : యూరియా కోసం రైతులు ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. పీఏసీఎస్, రైతు వేదికల వద్ద రైతులు క్యూలైన్లలో నిలబడి యూరియా,టోకెన్ల కోసం బారులు తీరుతున్నారు. నాట్లు పెట్టి రెండు నెలలు దాటినా యూరియా దొరకక పోవడంతో గురువారం అర్వపల్లి పీఏసీఎస్‌కు ముందు జనగామ -సూర్యాపేట జాతీయ రహదారిపై యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ధర్నాకు దిగారు. దీంతో భారీగా వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ఒక్కో రైతుకు కనీసం 10 బస్తాల యూరియా అవసరం ఉంటే ఒకొక్క బస్తా ఇస్తే ఎలా అని రైతులు అధికారులను నిలదీశారు.
పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు. ధర్నాకు సిపిఎం పార్టీ మద్దతు తెలికింది. శుక్రవారం ఇచ్చే యూరియా కోసం ఒక రోజు ముందే గురువారం రోజు టోకెన్ల కోసం పీఏసీఎస్ ముందు రైతులు భారీగా బారులు తీరారు. టోకెన్ల విషయంలో కొంతమంది మహిళా రైతుల మధ్య తోపులాట జరిగింది. అలాగే తిమ్మాపురం రైతు వేదికలో 270 యూరియా బస్తాలు ఉండగా దాదాపు 500 మంది రైతులు భారీ క్యూ లైన్లో నిలబడ్డారు.
Arvapally : అర్వపల్లిలో యూరియా కోసం రైతుల ధర్నా