వాషింగ్టన్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు (Trump Tariffs) విధించేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessen) అన్నారు. అప్పుడే పుతిన్ చర్చలకొస్తారని, ఈ విషయంలో ఈయూ కూడా తమతో కలిసి ముందుకు రావాలని సూచించారు. మొదటి నుంచి భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతున్న బెసెంట్, ఇండియాను లక్ష్యంగా చేసుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌తో యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నదని పేర్కొంటూ భారత్‌పై అమెరికా అదనంగా 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం టారీఫ్‌లు 50 శాతానికి పెరిగాయి.
తాజాగా ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెసెన్ మాట్లాడుతూ.. రష్యాపై ఒత్తిడి పెంచడానికి అమెరికా సిద్ధంగా ఉందని, అయితే యూరోపియన్ భాగస్వాములు అందుకు సహకరించాలని వ్యాఖ్యానించారు. తమ ఒత్తిడికి ఉక్రెయిన్ సైన్యం ఎంతకాలం నిలబడగలదు? రష్యన్ ఆర్థిక వ్యవస్థ ఎంతకాలం నిలుస్తుంది? అనే దాని మధ్య పోటీ జరుగుతున్నదన్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని ఆంక్షలు, ద్వితీయ సుంకాలు విధించగలిగితే మాస్కో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందని, అప్పుడుఅధ్యక్షుడు పుతిన్‌ను చర్చలకు వస్తారని చెప్పారు.
ట్రంప్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైట్‌హౌస్ రోజ్ గార్డెన్లో జరిగిన ఓ కార్యక్రమంలో రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించి, పుతిన్‌ను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్.. ‘అవును, నేను సిద్ధంగా ఉన్నా’ అని సమాధానమిచ్చారు. తాజాగా ఆయన సన్నిహితుడు, అమెరికా ట్రెజరీ కార్యదర్శి కూడా అదేలా వ్యాఖ్యానించడం గమనార్హం.