వాషింగ్టన్: ప్రపంచంలో మరో యుద్ధం ముంచుకొస్తున్నది. రెండు దేశాల మధ్య యుద్ధానికి కరేబియన్ సముద్రం వేదికగా మారనుంది. ప్రపంచంలోనే భారీ చమురు నిల్వలున్న దేశంగా ప్రసిద్ధి చెందిన వెనెజులా ఆక్రమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెగబడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా ఆ దేశంపై కన్నేసిన ట్రంప్ డ్రగ్స్ ముఠాల నెపంతో ఆ దేశాన్ని కబళించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కరేబియన్ సముద్రంలో అగ్రరాజ్యం భారీగా యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, జలాంతర్గములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించింది. ఏక్షణామైనా వెనెజులా దేశంలోకి చొరబడటానికి ఇవి సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు 4,500 మంది సైనికులు, 2,300 మంది మెరైన్లు కూడా సిద్ధంగా ఉన్నారు. వెనెజులాకు కొద్ది దూరంలోనే ఉన్న ఈ ప్రాంతంలో అమెరికా దళాలు సైనిక విన్యాసాలు చేస్తూ కవ్వింపు చర్యలు ప్రారంభించాయి.
వెనెజులా డ్రగ్స్ ముఠాల నుంచి తమ దేశాన్ని మాదకద్రవ్యాలు ముంచెత్తుతున్నాయంటూ ట్రంప్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ ముఠాలతో వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన విమర్శించారు. ఆయనను పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా రూ.430 కోట్ల బహుమతి ఇస్తామంటూ కూడా ప్రకటించారు.
అమెరికా యుద్ధ దుందుడుకు చర్యలను వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తప్పుబట్టారు. తమపై యుద్ధానికి దిగితే తాము కూడా సైనిక దాడితో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ట్రంప్ గౌరవం దెబ్బతినేలా ఆయన కార్యదర్శి, విదేశాంగ మంత్రి మార్కో రుబియో కరేబియన్ యుద్ధంలోకి ఆయనను లాగుతున్నారని ఆరోపించారు. ‘మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్.. జాగ్రత్తగా ఉండండి.. రుబియో మీ చేతులను రక్తంతో తడపాలనుకుంటున్నారు’ అని ఏడాది తర్వాత తొలిసారిగా కార్కస్లో జరిగిన అరుదైన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. వెనెజులా పౌరులు పోరాట యోధులని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటారని ఆయన అన్నారు.
2021 నాటికి వెనెజులా దేశంలో 48 వేల మిలియన్ టన్నుల చమురును గుర్తించారు. ప్రపంచ చమురులో 17 శాతానికి సమానం. వెనెజులాను ఆక్రమించుకోవాలన్న ఆశ ట్రంప్‌కు ఎప్పటి నుంచో ఉంది. 2017లోనే ఆయన వెనెజులాపై మనం యుద్ధం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 2023లో సైతం వెనెజులా కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘మేము దానిని ఆక్రమించుకునే వాళ్లం. దాని చమురు మొత్తాన్ని తీసుకునే వాళ్లం’ అని అన్నారు.
రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే అగ్రరాజ్యం ముందు నిలబడే పరిస్థితి వెనెజులాకు లేదు. ఎందుకంటే ఆ దేశానికి చిన్న సైన్యం, తక్కువ ఆయుధ సంపత్తి మాత్రమే ఉంది. 1,23,00 మంది సైనికులు, 2,30,00 మంది పౌర సైనికులు, సుఖోయ్-30, 1980ల నాటి ఎఫ్-16 ఇరాన్ డ్రోన్లు ఉన్నాయి. మొత్తం 229 యుద్ధ విమానాలు ఉన్నాయి. అమెరికాకు 13 వేల విమానాలు ఉన్నాయి.