మెదక్, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. చెరువుల్లో చేప పిల్లలను వదిలి మత్స్యకారుల ఉపాధికి దోహదపడింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీపై అలసత్వం వహిస్తోంది. ప్రతి ఏడాది మేలో అధికారులు ప్రతిపాదనలు పంపి, జూన్, జూలైలో టెండర్లు పూర్తి చేస్తారు. ఆగస్టు వరకు చెరువులు పూర్తి స్థాయిలో నిండి ఉంటాయి కాబట్టి చేప పిల్లలను చెరువుల్లోకి వదులుతారు. కానీ రెండేండ్ల నుంచి చేప పిల్లల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సెప్టెంబర్ వచ్చినా ఇప్పటికీ టెండర్లు పూర్తి కాలేదు. దీంతో మెదక్ జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఉన్నట్టా..? లేనట్టా అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని మత్స్యకారులు అంటున్నారు. ఈ సారి వర్షాలు కూడా భారీగా కురవడంతో మెదక్ జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకున్నాయి.ఆగస్టు 30 వరకు టెండర్లకు గడువు ముగిసింది. మళ్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 8వ తేదీ వరకు టెండర్ల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15లోగా టెండర్లు పూర్తి అయితే చివరి వారంలో చేప పిల్లలను పంపిణీ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్లో పంపిణీ చేస్తే చేప పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మత్స్యకారులు వాపోతున్నారు.
మెదక్ జిల్లా లో1718 చెరువులు ఉన్నాయి. ఈ ఏడాది లక్ష్యం 5 కోట్ల 30 లక్షల చేప పిల్లలు అవసరమని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది వర్షాకాలంలో జిల్లాలోని చెరువుల్లో లక్ష్యం మేరకు కాకుండా అందులో 20 శాతం చేప పిల్లలను మత్స్యసంఘాలకు పంపిణీ చేశారు. జిల్లాలో సుమారు 1.11 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉండగా, అందులో 64 లక్షల 50వేల పిల్లలను పంపిణీ చేశారు. అది కూడా ఆలస్యంగా పంపి ణీ జరిగిందని మత్స్యసంఘాల నాయకులు అంటున్నారు. గత ఏడాది చేప పిల్లలు చాలా చిన్న సైజులో నాసిరకంగా ఉండడం, అదును దాటిన తర్వాత ఆలస్యంగా చెరువుల్లో పోయడంతో పెద్దగా ఎదగలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు నష్టం తప్ప లాభం లేదని వాపోతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై 2016లో ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. గతంలో ప్రతి ఏడాది వర్షాలు కురిసన అనంతరం జూన్, జూలైలోనే చేప పిల్లలను పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల నుంచి చెరువులకు చేప పిల్లలు చేరిన దాఖలాలు లేవని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా చేప పిల్లల సరఫరాకు టెండర్ల ప్రక్రియ తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో టెండర్లు ఖరారు చేయాల్సి ఉండగా ప్రతి ఏడాది ఇదే తంతు కొనసాగుతుంది. చేప పిల్లల సరఫరా, చెరువుల్లో పోయడం ఆలస్యం అవుతోంది. చేప పిల్లలు ఎదగక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీలో ఆలస్యం చేస్తే తగిన లబ్ధిచేకూరడం లేదని మత్య్సకారులు చెబుతున్నారు. కిలో నుంచి రెండు మూడు కిలోల వరకు చేపలు ఎదగాలంటే చేప పిల్లలను ఆగస్టులోపు వదలాల్సి ఉంటుందని, అప్పుడే నాలుగు నెలల్లో వాటి వృద్ధి చెంది చేతికొస్తాయని చెబుతున్నారు. అలాంటి చేపలకు మార్కెట్లో మంచి ధర వస్తుందని, వాటిని ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.
మెదక్ జిల్లాలో 1718 చెరువులు ఉన్నాయి. 309 మత్స్యసంఘాలు ఉండగా, 16820 మంది సభ్యులు ఉన్నారు. అయితే జిల్లాలో మత్స్యకారులకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసే ప్రక్రియ ఈ ఏడాది కూడా ఆలస్యం కానుంది. అసలు టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఆగస్టు 18 నుంచి 30 వరకు టెండర్లు దాఖలు చేసే ప్రక్రియ కొనసాగింది. ఈ విషయంలో ఆన్లైన్లో టెండర్ల దరఖాస్తులు స్వీకరించడానికి మత్స్యశాఖ సిద్ధం కాగా కాంట్రాక్టర్లు ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. గడిచిన రెండేండ్ల నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తేనే ముందుకు వస్తామని వారు అంటున్నారు. కనీసం టెండరు దాఖలు చేయడానికి కూడా డబ్బులు లేవని వాపోతున్నారు. తమకు రావాల్సిన బకాయిలను తక్షణమే ఇప్పించాలని పలువురు కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లాలో రెండేండ్లకు సంబంధించి సుమారు రూ.2కోట్ల బకాయిలు రావాల్సి ఉందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్లకు ఈ నెల 8 వరకు గడువు ఉంది. టెండర్లు వచ్చిన కాంట్రాక్టర్లతో ఈ నెల చివరి వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేప పిల్లలను పంపిణీ చేస్తాం. ఈ ఏడాది లక్ష్యం 5 కోట్ల 30 లక్షలు. మెదక్ జిల్లాలోని 1718 చెరువులు, కుంటల్లో చేప పిల్లలను పంపిణీ చేస్తాం. ఆలస్యమైనా చేప పిల్లల ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం ఉండదు.
– మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి, మెదక్ జిల్లా