సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మహానగరంలో నిఘా వ్యవస్థ నీరుగారిపోతోంది. ఇక్కడ జరుగుతున్న ఉదంతాలు మన దర్యప్తు సంస్థలు, నిఘా వ్యవస్థలను వెక్కిరిస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ర్టాలకు వెళ్లి నేరస్తులను పట్టుకుంటున్నామంటూ, కేసులను ఛేదిస్తున్నట్లు జబ్బలు చర్చుకుంటున్న పోలీసు, ఆబ్కారీ, డ్రగ్ కంట్రోల్, ఈగల్ విభాగాలు సొంత ఇలాఖాలో జరుగుతున్న నేరాలను పసిగట్టలేకపోవడం విడ్డూరం. మొన్నటి వరకు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా అవుతుందంటూ ఉదరగొట్టిన పోలీసు, ఆబ్కారీ, ఈగల్ తదితర దర్యాప్తు సంస్థల మాటలకు పక్క రాష్ట్రం పోలీసులు బిగ్ షాకిచ్చారు.
బెంగళూరు, గోవా, ముంబై తదితర రాష్ర్టాల నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా అవుతుందనే అపోహను తొలగించి దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయ స్థాయిలో నగరం నుంచే డ్రగ్స్ సరఫరా జరుగుతుందని మహారాష్ట్ర పోలీసులు నిరూపించారు. కొంత కాలంగా చర్లపల్లి, నవోదయ కాలనీలో ప్లాట్ నంబర్ 193, ఫేజ్ నంబర్ 5 వద్ద ‘వాగ్దేవి ల్యాబ్స్’ పేరుతో మెఫెడ్రోన్ డ్రగ్స్ తయారీ జరుగడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో సరఫరా జరుగుతున్నట్లు మహారాష్ట్ర పోలీసులు తేల్చడం తెలంగాణ పోలీసు,నిఘా సంస్థల పనితీరుకు అద్దం పడుతోంది.
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన బంగ్లా దేశీయురాలు ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లా (23) ఇచ్చిన సమాచారం మేరకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు నగరానికి చేరుకుని చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్‌పై దాదాపు నెల రోజులకు పైగా నిఘా ఉంచారు. ఇందులో భాగంగా సదరు దర్యాప్తు సంస్థ స్వయంగా తమ సిబ్బందినే ఆ ల్యాబ్‌లో ఉద్యోగులుగా చేర్పించి..డ్రగ్స్ గుట్టు మొత్తం తెలుసుకుని రట్టు చేసే వరకు మన పోలీసు, దర్యాప్తు సంస్థలు, ఆబ్కారీ, డ్రగ్ కంట్రోల్ అధికారులకు సోయి లేకపోవడం గమనార్హం.
మహారాష్ట్ర పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ రాకెట్ వెనకాల మహానగరంలోని కొందరు పోలీసు, డీసీఏ, ఆబ్కారీ అధికారుల హస్తం, సహకారం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రాము మత్తు పదార్థాన్ని కూడా వదలకుండా పట్టుకుంటున్న పోలీసు, ఆబ్కారీ అధికారులకు యథేచ్ఛగా నగర శివారులోనే తయ్యారయ్యే కోట్ల రూపాయల విలువ చేసే వేల లీటర్ల డ్రగ్స తయారీ గురించి తెలియకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మత్తు మాఫియాకు రాజకీయ అండదండతో పాటు కొందరు పోలీసులు, డీసీఏ, ఆబ్కారీ అధికారుల సహకారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఆయా శాఖలకు చెందిన కొందరుఅధికారులు, కొందరు ప్రజా ప్రతినిధల అండదండలతోనే మత్తు దందా నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ర్టాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ విభాగంలో పసలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గోవా, బెంగళూరు, ముంబై వంటి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే గ్రాముల మోతాదులో డ్రగ్స్‌ను పట్టుకునే ఈగల్‌కు సొంత ఇలాఖాలో మత్తు పదార్థాలను గుర్తించి పట్టుకునే సామర్థ్యం లేదని తేట తెల్లమైపోయింది. ఆబ్కారీ అధికారులూ అదే బాటలో నడుస్తున్నారు. కేవలం గ్రాముల్లో గంజాయి పట్టుకునేందుకేపరిమితమవుతున్నారు. ఇక పోలీసు, డ్రగ్‌కంట్రోల్ అధికారుల పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.