సిటీ బ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వర్షమొస్తే పరిశ్రమల యజమానులు పండగ చేసుకుంటున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరదల్లోకి విచ్చలవిడిగా విష రసాయనాలను వదులుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే అత్యంత ప్రమాదకరమైన వ్యర్థాలను బయటకు వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాలాలు, వరద కాలువల్లోకి ఇష్టానుసారంగా విడుదల చేస్తూ కాలుష్య కాసారాలుగా మారుస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని పారిశ్రామిక వాడల నుంచి గుట్టు చప్పుడు కాకుండా మూసీతో పాటు, ప్రధాన నాలాలకు పైపులు, డ్రైనేజీల ద్వారా రసాయనాలను వదులుతున్నారు. అవి వరదలో కలిసి నగరంలోని చెరువులను కాలుష్యం చేస్తున్నాయి. చెరువుల్లో జీవజాలం మనుగడను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి.
హైదరాబాద్ పరిధిలోని చెరువుల్లో చేపలు, ఇతర జీవరాశుల మనుగడ ప్రశ్నార్థంగా మారుతున్నది. చెరువుల్లోని చేపలు, ఇతర జీవులు నిత్యం మృత్యువాత పడుతున్నాయి. ఈ దుస్థితి క్రమంగా నగర శివార్లకు విస్తరించింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల చెరువులను పరిశ్రమల నుంచి అనధికారికంగా విడుదల చేస్తున్న విష రసాయనాలు కలుషితం చేస్తున్నాయి. ముఖ్యంగా బొల్లారం, నాచారం పారిశ్రామిక వాడల నుంచి విష రసాయనాలను నాలాల్లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రాంపెల్లి, చెరువు, సూర్యనారాయణ చెరువు, చీరాల చెరువులు కాలుష్య కాసారాలుగా మారాయి. ఈ చెరువుల్లో జీవజాలం మనుగడ కనుమరుగైంది. ఈ చెరువుల నుంచి వస్తున్న వరద ఘట్కేసర్ సమీపంలోని ఏదులాబాద్ చెరువులోకి చేరుతున్నది. తాజాగా విష రసాయనాలు కలవడం వల్ల చెరువులోని చేపలన్నీ మృత్యువాత పడ్డాయి.
గ్రేటర్ పరిధిలోని పరిశ్రమలకు ఏదులాబాద్ చెరువు అడ్డగా మారుతున్నది. వర్షాకాలం వచ్చిందంటే వరదలోకి రసాయనాలను వదిలి మిగతా చెరువును కాలుష్యం చేస్తున్నారు. ఇది ప్రతి వర్షాకాలం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి ఏదులాబాద్ చెరువుకు భారీగా వరద పోటెత్తుతోంది. వరదతో పాటు బొల్లారం, నాచారం పారిశ్రామిక వాడల నుంచి వచ్చిన విష రసాయనాలు, జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి కలుషిత నీరు చేరడంతో భారీ మొత్తంలో చేపలు మృత్యువాత పడ్డాయి. కలుషిత నీటి ప్రభావంతో చెరువలోని రూ.10 లక్షల విలువైన చేపలు చనిపోయాయని ఏదులాబాద్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, సెక్రటరీ బాలయ్య చెబుతున్నారు.
తమ జీవనాధారమైన చెరువును కాలుష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలం వరదలొచ్చిన సమయంలో పెద్ద మొత్తంలో చేపలు మృత్యువాత పడుతున్నాయని వాపోతున్నారు. కలుషిత నీటిని పంట సాగుకు వాడటం వల్ల వ్యాధుల బారిన పడి దిగుబడి తగ్గుందని చెబుతున్నారు. ఆ పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకుని తాము కూడా వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న కలుషిత నీటిని అరికట్టి తమను న్యాయం చేయాలని కోరుతున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి విష రసాయనాలు వెలువడే పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. నగరంలోని నాలాలు, వరద కాలువల్లోని నీటిని పరీక్షించి కలుషితాలు కలిశాయా లేదా అనే నిర్ధారించి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించాలి. వాటిని బహిరంగ ప్రదేశాలు, నాలాలు, వరద నీటిలోకి విడుదల చేస్తున్నట్లు రుజువైతే అటువంటి కంపెనీలపై తగిన చర్యలు తీసుకుని, జరిమానాలు విధించాలి. కానీ అటువంటి చర్యలేవీ తీసుకోవడం లేదని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. వరద నీటిలోకి కాలుష్య కారకాలను ఇష్టానుసారంగా వదులుతున్నా కాలుష్య నియంత్రణ మండలి ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రపు తనిఖీలు చేసి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఉదాసీనత వల్లే రాంపల్లి, సూర్యనారాయణరావు చెరువు, చీరాల చెరువులు కాలుష్య కాసారాలుగా మారాయని మండిపడుతున్నారు.
ప్రతి వర్షాకాలంలో కలుషిత నీరు కలవడం వల్ల ఏదులాబాద్ చెరువులో చేపలు చనిపోతున్నాయి. ఈసారి కూడా రూ.10 లక్షల విలువైన చేపలు చనిపోయాయి. మా జీవనాధారమైన చేపలు మృత్యువాత పడటంతో ఏటా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చేపలతో పాటు పంట పొలాలు కూడా కాలుష్యం బారిన పడటం వల్ల దిగుబడి రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. పరిశీలిస్తాం.. తనిఖీలు చేస్తామని చెబుతున్నారు కానీ ఎలాంటి పురోగతి ఉండటం లేదు. మాగోడు ఎన్నిసార్లు విన్నవించినా కలుషిత నీరు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్, జిల్లా అధికారులు స్పందించి చెరువులోకి కలుషిత నీరు రాకుండా అడ్డుకోవాలి. జవహార్ నగర్ డంపింగ్ యార్డు నుంచి కూడా భారీగా కలుషిత నీరు వస్తున్నది. దాన్ని కూడా అరికట్టాలి.
-మెంగ బాలకృష్ణ, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు, ఏదులాబాద్.