తెలిసినోళ్లకు చెప్పొచ్చు.. తెలియనోళ్లకూ చెప్పొచ్చు. చిక్కంతా ఈ తెలిసీతెలియని వారితోనే. అందరికీ అంతా, అన్నీ తెలియాలని లేదు. తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పూ లేదు. అంతేగానీ తెలిసీతెలియనితనంతో అంతా తెలుసనే షోతో నెట్టుకొచ్చే బాపతే చాలా బాధాకరం. మేధావులుగా చెలామణి అయ్యేవారు, ఎన్నో చూశాం, ఎన్నెన్నో చేశామని.. తమకు తాముగానే లేనిది ఆపాదించుకుంటూ పక్కోరిని పట్టించుకోకుండా, చెప్పేవారిని చులకనగా చూసే మైండ్‌సెట్‌తో మహా చిక్కులే.అడిగినవారికి విలువిచ్చినట్టా.. తాము అడిగింది ఆటవిడుపునకే తప్ప మరేమీ లేదన్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా సంశయించకుండా తెగిస్తారా..?
‘నేను కొట్టినట్టు చేస్తా… నువ్వు ఏడ్చినట్టు చెయ్యి..’ అనేది ఒక తీరు. అలాగే ‘నేను అడుగుతా.. నువ్వు చెప్పు, నేను విన్నట్టే చేస్తా.. మీతో మాట్లాడినట్టే నటిస్తా గానీ, ఫైనల్‌గా నేను చేసేదే చేస్తా.. నాకు నచ్చిందే రాస్తా..’ అనేది మరో తీరు. తోచినట్టుగా, అవసరం ఉన్నట్టుగా, అనుకూలంగా రాసేదే అని ముందే డిసైడ్ అయితే, ఆ మాత్రం దానికి ఇంత కథెందుకో? అన్నేసి రోజులెందుకో? అంతేసి మందిని పిలవడమెందుకు? గుక్కతిప్పుకోకుండా పని చేస్తున్నామని, ఒక్కొక్కరిని గంటల పాటు ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం ఎందుకు? పిలిస్తే వచ్చినోళ్లంతా తప్పుచేసినోళ్లా.. తప్పును వకాల్తా పుచ్చుకున్నోళ్లా.. కాదు కదా? మరి ఆల్రెడీ డిసైడ్ అయిన తీర్పునకు ఇప్పుడు విచారణ అన్న తీరుగా ఆ ప్రత్యేక ప్రదర్శన ఎందుకై ఉంటుంది?
కండ్లముందు కనిపిస్తున్న నిజాలను కారుచీకట్లలోకి నెట్టేందుకు పడుతున్న శ్రమను ఏమనుకోవాలి? నోట్లోకి వెళ్తున్న బుక్కెడు బువ్వను నేలపాలు చేసే తీరుగా నెరపుతున్న వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదేమీ చిన్నాచితక ముచ్చటేం కాదు. ప్రపంచమే అబ్బురపడి ఔరా.. అనిపించేలా నిర్మితమైన ఎత్తిపోతల కాళేశ్వరం. పురుడు పోసుకున్న నాటి నుంచి ప్రజలకు ఉపయోగంలోకి వచ్చేవరకు దాని గురించి దాచింది లేదు, ఎవ్వరి కళ్లకూ గంతలు కట్టింది అంతకన్నా లేదు. అందరూ అన్నీ చూడొచ్చు.. అన్నింటిని పరిశీలించొచ్చు.. అన్నట్టే వదిలేశారు. అలాంటి మహాద్భుతాన్ని మట్టిలో కలిసిపోబోతోంది అన్నట్టుగా నడిపిస్తున్న ఈ చరిత్ర ఎవరినుద్దేశించి రాస్తున్నట్టు? పూడుకుపోయిన బీళ్లు మళ్లీ నోళ్లు తెరిచేలా ఉబలాటపడుతున్న పెద్దరికం ఏ భవిష్యత్తు తరాలను బలివ్వడం కోసమో?
మంచినెప్పుడు మెచ్చుకోవాల్సిన అవసరం లేకున్నా, చెడును తట్టి లేపడమే దయనీయ స్థితి. నలుగురిది ఒక దారైతే, ఒక్కడుపోయేదే సరైనదనే వాదన వెనుక మతలబు ఏమై ఉంటుందో కదా? సరే ఒక్కడే నాలుగు దారులు వేసే వెసులుబాటు ఉండొచ్చు, ఒక్కడితోనే ఎన్నో నెరవేరే అవకాశాలూ ఉండొచ్చు. కానీ, ఒక్కడు సక్రమమా.. అక్రమమా.. సరైనదేనా.. సంక్లిష్టమా.. అనే పరిపరి విధాలైన అనుమానాలను పట్టించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం తప్పనిసరి. కాళేశ్వరం కూలిందా.. కూలుద్దా.. కూలడానికి రెడీ అయ్యిందా? లేదంటే ‘కూల్చండి మహా ప్రభో.. నేనుండలేన’ని దానంతట అదే మొరపెట్టుకుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రకృతే దాని పర్యవసానాలతో పరీక్షలు పెడుతుంది.
కానీ, జరిగిన తప్పిదాన్ని సూక్ష్మంలో వెతికి, అల్పాన్ని అధికంగా కాకుండా అత్యధికంగా, అంత పెద్ద నిర్మాణం మొదటికే మోసం అనే ఆలోచనను జనాల్లోకి చేర్చేందుకు ఉబలాటపడుతున్నారనేది కమిషన్ ముందు హాజరైన పెద్దల అభిప్రాయాలను చూస్తే తెలిసిపోతోంది. పెద్ద కట్టడంలో చిన్న లోపాలు సహజం. అంతమాత్రాన ఇక కథ కంచికే, కాళేశ్వరం కూలుటకే.. అన్నట్టుగా పనిగట్టుకొని చేసే ప్రచారాన్ని ఎవరూ పసిగట్టలేరనే పబ్లిసిటీనీ విస్తృతంగా చక్కర్లు కొట్టిస్తూనే ఉన్నారు.
చూపులేనోడికి కావాల్సింది కళ్లు. అవి ఎవరిస్తేనేం.. ఏ రంగువైతేనేం..! రంగునే చూడలేని వ్యక్తికి అయ్యో… నలుపు రంగు మనిషివి ఇస్తున్నారటా అనే ఆందోళన ఉండదు. ఎరుపు మాత్రమే కావాలనే పట్టుదలకు అంతకన్నా పోడు. అవసరం ఉన్నప్పుడు ఇచ్చినవారు అందరికన్నా ఎక్కువే అవుతాడు. పడావు పడ్డ భూములను పచ్చగా చేసేందుకు కేసీఆర్ తరలివచ్చాడు. ప్రతిపక్షమా.. అధికార పక్షమా.. అనేది కాకుండా ఆయన కేవలం ప్రజాపక్షంగా మారడానికి ఆ తెగింపే పనిచేసింది. ఇల్లు కట్టడమే కాదు, కాపురాన్ని చక్కదిద్దుకోవాలనే కసితో తెచ్చిన రాష్ట్రంలో తెగించి ప్రాజెక్టులను చేపట్టి అనుకున్న సమయానికి చేసిచూపారు.
అందుకే దుబాయి.. బొగ్గుబాయి.. వంటి బాటలకు వెళ్లిన వారంతా తమ బాయిల కాడ్నే బతుకు దెరువు ఉందని తిరుగుబాటపట్టారు. చేతినిండా పనులతో సకుటుంబంగా గడిపారు. వాళ్లకు అప్పుడు కావాల్సింది కారు గుర్తా.. కాంగ్రెస్ పార్టా.. అనేది కాదు, ఆ సమయానికి తమకు కావాల్సినవి ఇచ్చిన మహోన్నత వ్యక్తి మాత్రమే. అదే పనిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేశారు. ఫలాలను గుమ్మానికి దొర్లించారు. ఎంత చేసినా కాళేశ్వరంలోని, అందునా మేడిగడ్డలోని ఆ రెండు పిల్లర్లను తిరిగి నిర్మాణం చేయడం, ఆ బ్లాక్‌ను పూర్తిగా సంస్కరించడం చేయాల్సిన అనివార్యమే తప్ప మరేమీ చేసేది ఉండదు. మిగతా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేవని స్వయానా బయటకు చెప్పకున్నా ప్రభుత్వ పెద్దల సనుగుడో, మాటమార్చుడో చూస్తుంటే తెలిసిపోతున్నదే.
కాళేశ్వరం అంటే 2014కి ముందు వరకు కేవలం పరమశివుడు కొలువైన ముక్తీశ్వర పీఠం. ఆ తర్వాత భగీరథుడిని నేలకు దింపిన ఆ శివుడి అంశనే ప్రేరణగా తీసుకొని గంగమ్మ తల్లి (గోదారమ్మ)ని యావత్ తెలంగాణకు పారించి పరమ పవిత్రమైన జలదృశ్యాన్ని లిఖించిన కేసీఆర్ కలల స్వరూపంగా రూపుదిద్దుకుంది. రాత్రికి రాత్రే బాయికి పెట్టిన మోటరేసి నీళ్లు కాల్వలో పారేట్టు చేసేందుకు కేసీఆర్ ఏం దివి నుంచి భువికి దిగొచ్చిన అతీత శక్తిస్వరూపుడేం కాదు. తీక్షణంగా పరిశీలించడం ఆయన చేసిన నిపుణత. గగ్గోలు పెట్టడం కాదు, గమనించాలనే సోయితో సావధానంగా ముందడుగు వేసిన నైపుణ్యం ఆయన సమయస్ఫూర్తి. అందులోంచి పుట్టిందే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.
ఇప్పుడు కొందరు నెత్తీనోరు కొట్టుకుంటూ గగ్గోలు పెడుతున్నట్టు తుమ్మిడిహట్టికి, మేడిగడ్డకు తేడా స్వల్పమే. అదీ నిపుణుల సూచనలు, అధ్యయనాల ఆధారంగా మార్పునకు ఇబ్బందులేం లేవని తెలుసుకుని షురూ చేసిందే. ఇక అక్కడి నుంచి నీళ్లకు నడక నేర్పే లౌక్యాన్ని తెలివిగా ఒడిసిపట్టారు కేసీఆర్. ప్రాణహిత, గోదావరి కలిసే మేడిగడ్డ సెంటర్ పాయింట్‌గా రూపకల్పనకు శ్రీకారం జరిగింది. అక్కడి నుంచి గ్రావిటీతో అసాధ్యమనే విషయం తెలుసుకొని అన్నారం, సుందిళ్ల అనే బ్యారేజీల రూపకల్పన, సుందిళ్ల నీటిని ఎల్లంపల్లికి తరలించి అక్కడి నుంచి నందిమేడారం, గాయత్రి పంప్‌హౌస్‌కు తరలించడం ఓ గొప్ప ప్రక్రియ.
ఇక ఈ పంప్‌హౌస్‌లో ఉండే బాహుబలి మోటర్ల గురించి ప్రపంచమే అబ్బురపడే పరిస్థితి. (అయితే ఇక్కడ మాత్రం కొందరికి కడుపులో పేగులు కమిలే వాసన. అది వేరే విషయమనుకోండి) వాటితో ఎస్సారెస్పీకి చెందిన రెండు కెనాల్స్‌లో నీటిని పంపింగ్ చేసి గ్రావిటీ ద్వారా మిడ్ మానేరుకు తరలించడం మరో అద్భుతం. ఎక్కడి మేడిగడ్డ, మరెక్కడి మిడ్ మానేరు! దారెంటా పచ్చని రంగులే. ఇక ఈ కేంద్రబిందువైన మిడ్ మానేరు నుంచి మరింత అద్భుతమైన అనంతసాగర్‌కు, అక్కడి నుంచి రంగనాయక్ సాగర్‌కు, తర్వాత మల్లన్న సాగర్‌కు, కొండపోచమ్మ, గంధమళ్ల, బస్వాపూర్.. ఇలా చెప్పుకొంటూపోతే కాళేశ్వరం అద్భుతమనే పదానికే అద్భుతమైన అర్థాన్ని తెచ్చిన ఒకానొక బృహత్తర ప్రాజెక్టు.
అలాంటి ప్రాజెక్టుపై చిలువలు పలువలుగా కాకుండా డొక్క గుంజుకపోయి, సావుతో దోస్తీ చేస్తున్న తెలంగాణ రైతన్నకు కాస్త కండ్లలో వెలుగు, కండలో రకతం వచ్చేలా చేసిన గొప్ప పనికి పట్టాభిషేకం చేయకున్నా, జరిగిన లోపాలను గుర్తించి, జరగాల్సిన సవరణలకు శ్రీకారం చుట్టి జలానికి బలాన్ని ఇవ్వడమే తక్షణ కర్తవ్యం. బుక్కెడు బువ్వపెట్టే ఆ అన్నదాతకు అదొక్కటి సమకూర్చి, మీకు మీరుగా తర్వాత ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎంత దూరమైనా వెళ్లొచ్చు. అలా చేయకపోతే రాతి కుండకు, ఇనుప తెడ్డు మాదిరిగా వ్యవస్థ తయారవుతది. ఏదేమైనా అన్నింటినీ అందరూ గమనిస్తున్నారనేది నగ్నసత్యం. అంగీకరించాలని ఉన్నా మనసొప్పని చేదు నిజం.
రాజేంద్రప్రసాద్ చేలిక