మారీసన్
నెట్ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: ఫహాద్ ఫాజిల్, వడివేలు, కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితార, శరవణ సుబ్బయ్య తదితరులు, దర్శకత్వం: సుధీశ్ శంకర్
మనిషి స్వార్థపరుడు. తన సుఖం కోసం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నుతుంటాడు. త్యాగం అనే మాటనే చెవికెక్కించుకోడు. కానీ, ఈ సుదీర్ఘ జీవన ప్రయాణంలో సందర్భానుసారం స్వార్థాన్ని పక్కనబెట్టి, త్యాగాన్ని స్వీకరించకపోతే.. జీవితం అసంపూర్ణమే అవుతుంది. మారీసన్ సినిమా కూడా ఇదే సందేశాన్ని హృద్యంగా, వినోదాత్మకంగా చూపిస్తుంది. మలయాళంలో క్రేజీ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ఫహాద్ ఫాజిల్. ఇటు తమిళంలో కమెడియన్గా వడివేలుది సుదీర్ఘమైన కెరీర్. ఈ ఇద్దరు ప్రతిభావంతులైన నటులతో ప్రత్యేకమైన కథను ఆవిష్కరించాడు దర్శకుడు సుధీశ్ శంకర్.
గత జూలైలో థియేటర్లలో సందడి చేసిన మారీసన్.. తాజాగా నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. కథలోకి వెళ్తే.. దయాళ్ (ఫహాద్ ఫాజిల్) ఓ చిల్లర దొంగ. ఖరీదైన వస్తువేదైనా కంటికి కనిపించిందంటే కాజేయాల్సిందే! వాటిని ఎత్తేయాల్సిందే! జైలు శిక్ష పూర్తయి బయటకి వస్తూనే.. మళ్లీ దొంగతనాలకే వెళ్తుంటాడు. ఆ ప్రయత్నంలోనే ఒక ఇంట్లోకి చొరబడుతాడు. ఆ ఇంట్లో గొలుసుతో కట్టేసి, ఒంటరిగా ఉంటున్న వేదాచలం (వడివేలు)ను చూస్తాడు. అతన్ని అలా చూసి ఆశ్చర్యపోతాడు దయాళ్. తాను అల్జీమర్స్ బాధితుడిననీ, తన కొడుకే ఇలా బంధించాడని చెబుతాడు వేదాచలం. తనను అక్కడినుంచి విడిపిస్తే.. డబ్బులు ఇస్తానని ఆశచూపుతాడు. దాంతో, వెంటనే వేదాచలాన్ని విడిపిస్తాడు దయాళ్. ఈ క్రమంలో ఏటీఎం సెంటర్కి వెళ్లి డబ్బులు డ్రా చేస్తాడు వేదాచలం.
అప్పుడే.. అతని బ్యాంక్ ఖాతాలో లక్షల రూపాయలు ఉండటం దయాళ్ దృష్టికి వస్తుంది. దాంతో, ఆ డబ్బును ఎలాగైనా కొట్టేయాలని నిర్ణయించుకుంటాడు. తాను అరుణాచలం వెళ్తున్నట్లు వేదాచలం చెప్పడంతో.. తాను కూడా అటువైపే వెళ్తున్నాననీ, తనవెంట రావాలనీ కోరుతాడు. ఇద్దరూ కలిసి బైక్పై ప్రయాణం మొదలుపెడతారు. ఈ సందర్భంగా వేదాచలం తెలుసుకోమన్న చిరునామాలను దయాళ్ తెలుసుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే.. ఆ అడ్రస్కి చెందిన వ్యక్తులు దారుణంగా హత్యకు గురవుతూ ఉంటారు. అసలు ఈ వేదాచలం ఎవరు? నిజంగానే అల్జీమర్స్ బాధితుడా? అతని నేపథ్యం ఏమిటి? జరుగుతున్న హత్యలకు ఎవరు కారకులు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా సాగుతుంది.