హనుమకొండ చౌరస్తా/ గీసుగొండ/ జనగామ చౌరస్తా, నవంబర్ 26 : తెలంగాణ సాధించిన కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తితో ఓరుగల్లు నుంచే ప్రతిఘటన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓరుగల్లును అవమానిస్తూ… ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజముద్ర నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఘోరీ కట్టేదిశగా పోరాటం నడుస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క బీసీ వర్గాలకే కాదు.. తెలంగాణలోని సబ్బండవర్గాలకు అన్యాయం చేస్తున్నదని అన్నారు. కేసీఆర్ స్ఫూర్తిని అందిపుచ్చుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ… ఏ ఎన్నిక వచ్చినా కదంతొక్కుదాం.. ఒక్కొక్క నాయకుడు, కార్యకర్త, సోదరి.. మరో కేసీఆర్ కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 2009లో ఉద్యమనేత కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను పురస్కరించుకొని నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సన్నాహకాల్లో భాగంగా హనుమకొండ, జనగామ జిల్లాల బీఆర్ఎస్ కార్యాలయాల్లో బుధవారం జరిగిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. మొదట ఆయన గీసుగొండ మండలం ఊకల్ శ్రీనాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అక్కడ నుంచి స్థానిక నాయకులతో కలిసి వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్‌లోని కిటెక్స్ గార్మెంట్స్ పరిశ్రమలోని స్పిన్నింగ్, జిన్నింగ్ యూనిట్ పరిశీలించారు. అనంతరం ఆయా కార్యక్రమాల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పదహారేండ్ల క్రితం కేసీఆర్ తెగింపుతో ఇచ్చిన పిలుపుమేరకు ఆ రోజు దీక్షా దివస్ వచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం 11 రోజులు అన్నాహారాలు మానేసి చావు నోట్లో తలపెట్టిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న మనం ఎంతో అదృష్టవంతులం. మన పార్టీ మనకు గర్వకారణం.

అధికారం ఉండొచ్చు, లేకపోవచ్చు. జీవితంలో ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు. తెలంగాణ సాధించింది గులాబీ జెండా అనేది చరిత్రలో నిలుస్తుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఏ ఎన్నికైనా కేసీఆర్ స్ఫూర్తితో ముందుకుపోదాం. ఇంకో రెండేండ్లు పోరాటాలు తప్పవు, కేసులు తప్పవు, దుర్మార్గపాలన ఎదుర్కొనేందుకు పోరాటాలు తప్పవు. రేవంత్‌రెడ్డి అత్త సొమ్మో, అయ్య సొమ్మో అన్నట్లుగా రూ.5లక్షల కోట్ల విలువైన భూములు సొంత పార్టీ వాళ్లకు, వాళ్ల అన్నదమ్ములకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నడు. అవినీతి ఆనకొండలా అనుముల రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి పట్టిన విషపురుగులా తయారయ్యాడు. అలాంటి దుర్మార్గుడిని ఎదుర్కోవాలంటే గ్రామగ్రామాన చైతన్యం వెల్లివిరియాలి. దీక్షా దివస్ స్ఫూర్తితో మనందరం కదం తొక్కాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని 2009, నవంబర్ 29న కేసీఆర్ కరీంనగర్లో బయలుదేరి సిద్దిపేటకు వెళ్లేక్రమంలో పోలీసులు అరెస్టు చేసి వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తీసుకెళ్లడం ఇంకా నా మనసులో తిరుగుతున్నది. ఆ రోజు కరీంనగర్ అల్గునూర్‌లో కేసీఆర్‌ను అరెస్టు చేసి కారులో లక్ష్మీకాంతారావు, నాయిని నర్సింహారెడ్డి తీసుకెళ్తుండగా మేం అక్కడికి చేరుకున్నాం. అక్కడి నుంచి జయశంకర్ సార్‌తో కేసీఆర్ వెంట వచ్చాం. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు రాస్తారోకో చేస్తుంటే నేను అక్కడ దిగిన. మీరు ఇంటికి వెళ్లండని జయశంకర్‌సార్‌కు చెప్పిన. నేను ఇక్కడే ధర్నాలో కూర్చుంటే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుంటే హనుమకొండ చౌరస్తాలో పోలీస్ వ్యాన్ దుంకి జయశంకర్‌సార్ ఇంటికి పోయి అక్కడ ఉన్నం. 2 గంటల తర్వాత పోలీసులు వచ్చి మళ్లీ అరెస్టు చేసి ఇదే వరంగల్ గడ్డపైనే జైలులో పెట్టారు. నవంబర్ 30న రాత్రి దాదాపు విడుదల చేస్తే ఖమ్మంలో కేసీఆర్ ఉన్న దగ్గరికి వెళ్లాం.
ఆ దీక్ష తర్వాత తెలంగాణ సమాజం, విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, ప్రజలు, ప్రతి వర్గం కదలింది. తెలంగాణ మొత్తం కదనభూమి, యుద్ధభూమిని తలపించేలా ఎక్కడికక్కడ వీరోచితంగా కదిలింది. కేసీఆర్ దీక్ష ప్రారంభమై తెలంగాణ ప్రకటన వచ్చేవరకు 11 రోజులపాటు అద్భుతంగా ఒక సముద్రంలా ఎగిసిపడింది. తుపాన్ వాతావరణం సృష్టించింది. ఈ తరం పిల్లలకు తెలంగాణ ఉద్యమ పోరాటం గురించి తెలియదు. నా కొడుకుకు అప్పుడు ఎనిమిదేండ్లు. ఇప్పుడు 20 ఏండ్లు. ఇప్పటి వాళ్లకు అవన్నీ తెలియజెప్పాలె. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష, అమరుల
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలతోపాటు బీసీలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతమని చెప్పి 17 శాత మే ఇచ్చిందని.., కొన్ని జిల్లాల్లో దారుణంగా ఉన్నదన్నారు. భారతదేశంలో బలహీన వర్గాలకు ఇంతకంటే అన్యాయం ఎన్నడూ, ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పారు. జనగామ జి ల్లా నర్మెట్ట మండలంలో 17 గ్రామ పంచాయతీలుంటే ఒక్క టే బీసీ రిజర్వేషన్ ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణలోని 32 జిల్లాల్లో గతంలో 24శాతం ఉంటే 17 శాతం చేసి రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బలహీన వర్గాల ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఆలోచించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రజల ఆశీర్వాదంతో అధికారం చేపట్టిన జననేత కేసీఆర్ ప్రజల ఆకాంక్ష మేరకు జనగామ జిల్లా ఏర్పాటు చేశామన్నారు. నూతన కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీని మంజూరు చేయడమే కాదు వాటిని ప్రజలందరికి అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్‌దే అన్నారు. కేసీఆర్ కృషితో ఒకనాడు తీవ్రమైన కరువు ప్రాం తంగా ఉన్న జనగామ ఇవాళ సస్యశ్యామలంగా మారిందన్నారు. దేవాదుల ఎత్తిపోతల కాల్వల ద్వారా రైతులకు సాగునీరు, ఫ్లోరైడ్ బారి నుంచి ప్రజలను రక్షించడానికి మిషన్ భగీరథ తాగు నీరు అందించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు ఇన్ని మంచి పను లు చేసిన కేసీఆర్‌ది తప్పా.. అందుకు ఆయనను జైలుకు పంపించాలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాజకీయంతోపాటు విద్య, ప్రభుత్వ ఉద్యోగ, కాంట్రాక్టుల్లో ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రె స్ దొంగ ఓట్లు వేయించి దగా చేసి గెలిచారని మండిపడ్డారు. అందుకని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురేయాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో ఎమ్మెల్యే పల్లా, మాజీ మంత్రులు దయాకర్‌రావు, రాజయ్య వంటి ముగ్గురు బలమైన మాస్ లీడర్లు ఉ న్నారని నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పోరాడే నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయి స్తే హైదరాబాద్ నుంచి స్వయంగా తానే లాయర్లను పంపిస్తానని కేటీఆర్ శ్రేణులకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కడియం శ్రీహరి తరహాలో కాంగ్రెస్ లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారు. అయినా ఆయన ఒక్కటే మాట అన్నారు. నే ను నమ్ముకున్న నాయకుడు ఒక్కరే.. ఆ నాయకుడు కేసీఆర్, ఆయనతోనే ఉంటానన్నారని, నిజమైన విధేయత, విశ్వా సం, విశ్వసనీయతకు ప్రతిరూపంగా ఎమ్మెల్యే పల్లా నిలిచారని కొనియాడారు.
త్యాగాలు, ముఖ్యంగా శ్రీకాంతాచారి అమరత్వం, విద్యార్థులు, ఉ ద్యోగుల, జర్నలిస్టుల పోరాట స్ఫూ ర్తిని తిరిగి మళ్లీ తలుచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళుతున్నా.. తిరిగి తెలంగాణ రాష్ట్రంలనే నా కాలు పెడతా’ అని కేసీఆర్ కమిట్మెంట్తో రాష్ర్టాన్ని సాధించినట్లు తెలిపారు. తెలంగాణను దోచుకుంటున్న, ప్రజలను రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఆనాటి త్యాగనిరతి, పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందుకెళ్లాలి. ప్రతి సంవత్సరం నవంబర్ 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నం. వరంగల్‌లో ఇంకా గొప్పగా జరుతుంది. ఇక్కడ కవులు, కళాకారులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు, ఇతర సంఘాలను కలుపుకొని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్ ప్రతి సంవత్సరం 11 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. మనకు రాష్ర్టాన్ని తెచ్చిపెట్టిన దీక్షను గుర్తుచేసుకోవడంతోపాటు మహానాయకుడు కేసీఆర్‌కు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.
మళ్లీ అందరం ఒక్కసారి గట్టిగా కదం తొక్కాల్సిన అవసరం ఉన్నది’ అని కేటీఆర్ అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, డీఎస్ రెడ్యానాయక్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, మాజీ చైర్మన్లు ఎం.సుధీర్‌కుమార్, సాంబారి సమ్మారావు, బడే నాగజ్యోతి, నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, కె.వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, లలితాయాదవ్, పులి రజినీకాంత్, బొళ్లపెల్లి పున్నంచందర్, కంజర్ల మనోజ్‌కుమార్, పేర్ల మనోహర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఉద్యమ నేతగా కేసీఆర్ న్యాయ, ధర్మ పోరాటం చేశారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంట ఉండి గర్జించి రాష్ట్రం సాధించిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు, మహిళలకు ఎక్కడ చిన్న ఇబ్బంది కలిగినా బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ఆఫీసు జిల్లాలో జనతా గ్యారేజీలా ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరిస్తున్నదని చెప్పారు. వరదల సమయంలో బాధితులకు పార్టీ అండగా నిలిచిందన్నారు. చిరు వ్యాపారులకు న్యాయవాదులు అండగా నిలిచారని చెప్పారు. పార్టీ కార్యాలయాలను కూల్చివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే బీఆర్ఎస్ లీగల్‌సెల్ అండగా నిలిచిందన్నారు.
గీసుగొండ మండలంలోని ఊకల్ మీదుగా టెక్స్టైల్ పార్కుకు వెళ్తున్న కేటీఆర్ కాన్వాయ్ స్టేషన్ చింతలపల్లి రైల్వే గేటు వేసి ఉండడంతో ఆగింది. కారులో ఉన్న కేటీఆర్ అటువైపు నుంచి వెళ్తున్న ముగ్గురు యువకులను ఆపి వారితో మాట్లాడారు.
కేటీఆర్ : మీ ముగ్గురిది ఎక్కడ? లోకలేనా ?
ఆ ముగ్గురు : మాది సంగెం మండలం చింతలపల్లి గ్రామ శివారు వాల్‌నాయక్ తండా సార్.
కేటీఆర్ : మీ పేర్లు బానోత్ రమేశ్, బానోత్ సతీశ్, ఇస్లావత్ సురేశ్
కేటీఆర్: మీరు ఏం చేస్తారు ? టెక్స్టైల్ పార్కులో మూడేళ్ల్ల క్రితం పనిచేసినం
కేటీఆర్: ఏం పనిచేశారు ? ఆరు నెలల పాటు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాం.
కేటీఆర్ : ఇప్పుడు చేస్తున్నారా ? లేదు సారు.. మమ్మల్ని తీసేశారు. ఇప్పుడు వ్యవసాయ పనులు చేస్తున్నం.
కేటీఆర్: మీ గ్రామం నుంచి ఎంత మంది పార్కులో పనిచేస్తున్నారు?
మా దగ్గరి నుంచి చాలా తక్కువ మంది పోతున్నరు.
అంతా బయట వాల్లే పనిచేస్తున్నారు.
కేటీఆర్ : స్థానికులకే పార్కులో ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనే
నిబంధన ఉంది మీకు తెల్వదా ?
మేము ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్తే ఎవరూ లోపలికి రానివ్వరు, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నం సార్
కేటీఆర్ : పార్కులోకి వెళ్లి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని అడగండి..
మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
సరే సార్ వెళ్లి అడుగుతాం.