మహబూబాబాద్, నవంబరు 26 (నమస్తే తెలంగాణ) : మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు వేళైంది. గురువారం అధికార యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు నామినేషన్ల స్వీకరణను ప్రారంభించనుంది. ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి పరిధిలోని 23 మండలాలకు సంబంధించిన 555 జీపీలు, 4952 వార్డులకు ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారులను నియమించారు.
ఎన్నికల అధికారు లు ఈ నెల 29 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించి 30న పరిశీలించనున్నారు. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగానే తుదిజాబితాను ప్రకటించి 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాన్ని ప్రకటించనున్నారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరుపనున్నారు. కాగా, మహబూబాబాద్ జిల్లాలో 49, హనుమకొండ 24, వరంగల్ 29, ములుగులో 15, జనగామలో 30, జయశంకర్ భూపాలపల్లిలో 24, మొత్తం 171 నామినేషన్ కేంద్రాలను సిద్ధం చేశారు.
మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ మండలంలో 13, గూడూరులో 12, కేసముద్రంలో 10, నెల్లికుదురులో 9, ఇనుగుర్తిలో 5 నామినేషన్ల కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటలో 7, పర్వతగిరిలో 9, రాయపర్తిలో 13, జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో 6, చిల్పూరులో 4, జఫర్‌గఢ్ 7, రఘునాథపల్లిలో 7, లింగాలఘనపురంలో 6, హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో 6, కమలాపూర్‌లో 10, భీమదేవరపల్లిలో 8, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో 5, తాడ్వాయిలో 5, గోవిందరావుపేటలో 5, భూపాలపల్లి జిల్లాలోని గణపురంలో 7, మొగుళ్లపల్లిలో 7, రేగొండలో 6, గోరికొత్తపల్లిలో 4 చొప్పున నామినేషన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
