సుబేదారి, నవంబర్ 26 : అవినీతి ఆరోపణలతో వారం క్రితం మామునూరు నుంచి వరంగల్ పోలీసు కమిషనరేట్ వీఆర్‌కు బదిలీ అయిన ఇన్స్పెక్టర్ ఒంటెరు రమేశ్‌తోపాటు గన్‌మెన్(కానిస్టేబుల్) జి.రఘును బుధవారం వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మామునూరు పోలీసులు యువకుడిని తప్పుడు కేసులో ఇరికించి.. రూ.లక్ష లంచం తీసుకొని చితకబాదిన ఘటనపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో గత అక్టోబర్ 14న ‘నరకం చూపుతున్న ఖాకీ’.. కారు నడపకపోయినా డ్రంకన్ డ్రైవ్ పేరిట చిత్రహింసలు, అదే నెల 19న ‘అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు సెటిల్మెంట్ రూ.4లక్షలు’ అనే శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యాయి.
వరుస కథనాలతో స్పందించిన వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు విచారణ చేపట్టారు. ఐనవోలు మండలం జోగయ్యపల్లికి చెందిన బాధితుడు కత్తుల రాజు మామునూరు సీఐ, ఎస్సైపై సీపీకి ఫిర్యాదు చేశాడు. బాధితుడి నుంచి సీఐ గన్‌మెన్ రూ.లక్ష లంచం తీసుకున్నట్లు సీసీ ఫుటేజీలు సైతం వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ సమగ్రంగా విచారణ చేపట్టి, పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌కు నివేదిక అందజేశారు. అయితే, ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ఎమ్మెల్యే కొడుకు సెటిల్మెంట్ రూ.4లక్షల కథనం అధికార పార్టీలో, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రకంపనలు సృష్టించింది.
ఈ క్రమంలో అవినీతికి పాల్పడిన మామునూరు అధికారులపై చర్యలు తీసుకుంటే తన కొడుకు సెటిల్మెంట్ వ్యవహారం నిజమవుతుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయనే ఉద్దేశంతో అధికార పార్టీ ఎమ్మెల్యే మామునూరు సీఐపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. సీపీ విచారణలో ఇన్స్పెక్టర్ రమేశ్ గన్‌మెన్ ద్వారా రూ.లక్ష లంచం తీసుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో వారం కిత్రం సీపీ ఇన్స్పెక్టర్ రమేశ్‌ను మామునూరు నుంచి వీఆర్‌కు బదిలీ చేశారు. వారం తర్వాత సీపీ తప్పని పరిస్థితిలో మామునూరు ఇన్స్పెక్టర్ రమేశ్, గన్‌మెన్ రఘుపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తున్నది.