మియాపూర్, మార్చి 17 : ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులను ఉల్లంఘిస్తూ.. అక్రమంగా అదనపు అంతస్తులను నిర్మించిన భవనాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. సదరు భవనాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావటంతో అధికారులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. శేరిలింగంపల్లి జోన్ మియాపూర్ సర్కిల్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో ఈ తరహాలో అక్రమంగా నిర్మించిన నాలుగు భవనాలను సీజ్ చేశారు.
మియాపూర్ ఆదిత్యనగర్‌లోని ప్లాట్ నంబర్ 1-60/107, ప్లాట్ నంబర్ 118, ప్లాట్ నంబర్ 1-60/108, మియాపూర్ సప్తగిరికాలనీలోని ప్లాట్ నంబర్ 147లో మొత్తం నాలుగు భవనాలను అధికారులు సీజ్ చేశారు. మంజూరు చేసిన అనుమతులకు భిన్నంగా.. అక్రమంగా అదనపు అంతస్తులను నిర్మించడంతో ఆయా భవనాలపై పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి.

దీంతో నోటీసులను జారీ చేసిన మియాపూర్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు మంగళవారం ఈ నాలుగు భవనాలను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
