Arunachalam | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 26 : తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదక్షిణ కోసం వెళ్లాలనుకునే భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 4న ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును వరంగల్-1 డిపో నుంచి ఏర్పాటు చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ డీ విజయభాను తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సు డిసెంబర్ 2న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరి.. 3న ఉదయం 6గంటలకు ఏపీలోని కాణిపాకంలోని గణపతి ఆలయం, మధ్యాహ్నం ఒకటి గంటలకు వెల్లూరులోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.
సాయంత్రం 7 గంటలకు బస్ అరుణాచలం చేరుకుంటుందన్నారు. అరుణాచలేశ్వరస్వామి గిరిప్రదక్షిణ పూర్తయ్యాక 4న మధ్యాహ్నం అరుణాచలం నుంచి బయలుదేరి 5న ఉదయము జోగులాంబ ఆలయానికి చేరుకుంటుందని తెలిపింది. దర్శనాల అనంతరం బీచుపల్లి హనుమాన్ ఆలయం దర్శనం తర్వాత తిరిగి హనుమకొండకు బయలుదేరుతుందని వివరించారు. పెద్దలకు రూ.5 వేలు, పిల్లలకు రూ.3500గా టికెట్ ధరను నిర్ణయించినట్లు తెలిపారు. tsrtconline.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, పూర్తి సమాచారం కోసం 8074562195, 9885779970, 9866373825, 9959226047 నెంబర్లను సంప్రదించాలని ఆర్ఎం కోరారు.