IND vs AUSపొట్టి ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు(Team India)కు సువర్ణావకాశం దొరికింది. ఐసీసీ టోర్నీల్లో కొరకరాని కొయ్యలా మారిన ఆస్ట్రేలియా(Australia)ను ఇంటికి పంపే లక్కీ చాన్స్ రోహిత్ సేనకు వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియాను సాగనంపేందుకు టీమిండియా సిద్ధమైంది. సూపర్ 8 ఆఖరి పోరులో భాగంగా జూన్ 24న భారత్ డారెన్ సమీ స్టేడియంలో ఆసీస్‌తో తలపడనుంది.
అసలే అఫ్గనిస్థాన్ చేతిలో 21 పరుగుల తేడాతో ఓడిన మిచెల్ మార్ష్ బృందం పరిస్థితి ఇప్పుడు చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా ఉంది. సోమవారం జరిగే మ్యాచ్ ఆసీస్‌కు చావోరేవో లాంటింది. ఇదే అదనుగా నిరుడు టెస్టు గదతో పాటు వరల్డ్ కప్ ట్రోఫీని తన్నుకుపోయిన కంగారులపై బదులు తీర్చుకునే టైమ్ టీమిండియాకు దొరికేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
ఆస్ట్రేలియాపై భారత్ గెలిస్తే మార్ష్ సేన కథ కంచికే. ఒకవేళ బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్ మ్యాచ్ వర్షార్ఫణం అయినా సరే మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రస్థానం ముగుస్తుంది. గ్రూప్ 1 నుంచి రషీద్ ఖాన్ బృందం సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంటుంది. అయితే.. బంగ్లా చేతిలో అఫ్గన్ టీమ్ ఓడితే నెట్ రన్‌రేటు పరంగా ఆసీస్ ముందుకెళ్లే చాన్స్ ఉంది.
ప్రస్తుతం అఫ్గనిస్థాన్ ఫామ్ చూస్తుంటే బౌలర్లనే నమ్ముకున్న బంగ్లాకు చెక్ పెట్టడం ఖాయమనిపిస్తోంది. ఆదివారం జరిగిన సూపర్ 8 రెండో పోరులో అఫ్గనిస్థాన్ 21 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. గుల్బదిన్ (Gulbadin Naib) నాలుగు వికెట్లతో విజృంభించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దాంతో, రషీద్ సేన మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.