న్యూఢిల్లీ: భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ఒకింత ఆందోళనకరంగా ఉంది. శనివారం ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పక్కటెముకల్లో బ్లడ్ బ్లీడింగ్ కావడంతో అయ్యర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని సమీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స అందజేశారు. పక్కటెముకల్లోని ప్లిహంలో రక్తం కారుతుండటంతో మెరుగైన వైద్యం కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చికిత్స అందించారు. అయితే ప్రస్తుతం అయ్యర్‌ను ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిసింది.
అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరంతరం పరిశీలిస్తున్నది. గాయం తీవ్రత దృష్ట్యా రెండు నుంచి ఏడు రోజుల లోపు అతని ఆరోగ్య పరిస్థితిపై అంచనాకు వచ్చే అవకాశముందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ‘అయ్యర్ ఎడమ వైపు పక్కటెముకల్లో గాయమైంది.
మెరుగైన చికిత్స కోసం వెంటనే అతన్ని దవాఖానకు తరలించాం. పలు స్కానింగ్‌ల తర్వాత ప్లిహంలో రక్తం కారడాన్ని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం అయ్యర్‌ను ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేశౠరు. అతని ఆరోగ్యం నిలకడగా ఉంది, త్వరగానే కోలుకునే అవకాశముంది. సిడ్నీతో పాటు భారత్‌లో వైద్య బృందంతో బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటి కప్పుడు సంప్రదింపులు జరుపుతూ పర్యవేక్షిస్తున్నది’ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
మరికొన్ని రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత భారత్‌కు తరలించే దానిపై పరిశీలిస్తామని బోర్డు ప్రతినిధులు తెలిపారు. ఇదిలా ఉంటే అయ్యర్‌ను చూసేందుకు అతని తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఎమర్జెన్సీ వీసా కోసం దరఖాస్తు చేసుకోగా, అనుమతి రాగానే పయనం కానున్నారు. మూడో వన్డేలో ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ క్యాచ్‌ను అందుకునే క్రమంలో అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.