‘ఇందులో శోభ అనే పాత్రలో కనిపిస్తాను. చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్. తనకు డబ్బంటే అత్యాశ. ఎలాగైనా రిచ్ అయిపోవాలనుకునే క్యారెక్టర్. సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది.’ అని సీనియర్ నటి శిల్పా శిరోధ్కర్ అన్నారు. సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ నాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ ఈ చిత్రానికి దర్శకులు. ఉమేష్‌కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నిర్మాతలు. నవంబర్ 7న పానిండియా స్థాయిలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఇందులో కీలక పాత్ర పోషించిన శిల్పా శిరోధ్కర్ సోమవారం విలేకరులతో ముచ్చటించారు.
‘ఇలాంటి పాత్ర చేయడం నాకిదే ప్రథమం. ఛాలెంజ్‌గా తీసుకొని చేశాను. డైరెక్టర్స్ క్లియర్ విజన్, సహకారం వల్లే ఇది సాధ్యమైంది. సుధీర్‌బాబుతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. తన జనరేషన్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. తను వందశాతం ఎఫర్ట్ పెట్టి డెడికేషన్‌తో ఈ ప్రాజెక్ట్ చేశారు. తను నాకు రిలేటివ్ అయినప్పటికీ ప్రొఫెషనల్‌గా ఇద్దరం పనిచేశాం.’ అని పేర్కొన్నారు శిల్ప శిరోధ్కర్. ఎమోషన్స్, స్టన్నింగ్ విజువల్స్‌తో కూడుకున్న సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ అని, ఇందులోని ప్రతి అంశం అందరికీ కనెక్ట్ అవుతుందని, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బావుంటాయని శిల్ప తెలిపారు. కంటెంట్ పరంగానే కాక, టెక్నికల్‌గా కూడా తెలుగు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిందని, ‘బ్రహ్మ’ తర్వాత ఇన్నాళ్లకు తెలుగుతెరపైకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని శిల్పా శిరోధ్కర్ సంతోషం వెలిబుచ్చారు.