అగ్ర హీరో రవితేజ కథానాయకుడిగా రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’. శ్రీలీల కథానాయిక. భాను భోగవరపు దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. రవితేజ మార్క్ పంచ్ డైలాగులతో, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలతో ఆద్యంతం వినోదాత్మకంగా ట్రైలర్ సాగింది.
హీరో, విలన్ల మధ్య ఉత్కంఠరేకెత్తించే సంఘర్షణ ట్రైలర్‌కు హైలైట్. నవీన్‌చంద్ర విలన్‌గా రవితేజను ఢీకొట్టే పాత్రలో కనిపించారు. శ్రీలీల అందం, శ్రీకాకుళం యాసలో తను మాట్లాడిన తీరు, రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ట్రైలర్‌కు మరింత అందాన్ని తెచ్చాయి. భీమ్స్ సిసిరోలియో కూడా తన నేపథ్య సంగీతంతో వింటేజ్ రవితేజ ఆరాను గుర్తు చేశారు. ఆకట్టుకునే పాటలు, అద్భుతమైన వినోదం మొత్తంగా విందుభోజనాన్ని తలపించిందీ ట్రైలర్. ఈ సినిమాకు కెమెరా: విధు అయ్యన్న.