గంగాధర, అక్టోబర్ 27: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ, బాత్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్న కీచక అటెండర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా పాఠశాల ఆవరణలో జరిగిన శుక్రవారం సభలో అటెండర్ అరాచకపర్వం బయటపడింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నాలుగురోజులుగా విచారణ కొనసాగిస్తుండగా, ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో యాకూబ్‌పాషా మూడేండ్ల నుంచి అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఏడాది క్రితం యాకూబ్‌పాషా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపించగా, ఉపాధ్యాయులు వార్నింగ్ ఇచ్చి వదిలివేశారు. నాలుగు రోజుల క్రితం పాఠశాల ఆవరణలో శుక్రవారం సభ నిర్వహించగా, అటెండర్ వేధింపుల విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయాన్ని అధికారులు వెంటనే కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆదేశాల మేరకు మహిళాశిశు సంక్షేమ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్, విద్యా, పోలీస్‌శాఖల అధికారులు విచారణ జరిపారు. సోమవారం సాయంత్రం పోలీసులు యాకూబ్‌పాషాను అరెస్ట్ చేసి గంగాధర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే ఆయనను సస్పెండ్ చేస్తూ జడ్పీ సీఈవో శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏడాది నుంచి విద్యార్థినులు వేధింపులకు గురయితే ఉపాధ్యాయులకు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడ్డారు.