కారేపల్లి,సెప్టెంబర్ 22: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి (Sharan Navaratri) ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అశ్వీయుజ శుక్ల ప్రతిపద మొదలుకొని నవమి వరకు తొమ్మిది రాత్రులను నవరాత్రులుగా వ్యవహరిస్తారు. ఏడాది పొడవున వచ్చే నవరాత్రి ఉత్సవాలలో దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రత్యేకంగా మహిళలు భావిస్తారు. ఆశ్వయుజ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యే దేవినవరాత్రి ఉత్సవాలు విజయదశమి వరకు జరుగుతాయి. హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ అవతారాలలో నవదుర్గ అవతారాలను ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహంకాళిగా అవతరించినట్లు పురాణకథ చెబుతున్నది. ప్రతీ అవతారం నుంచి మరొక రెండు రూపాలు వెలువడి మొత్తం తొమ్మిది రూపాలలో నవ దుర్గలుగా భావిస్తారు. మహిళలు, పురుషులు ఈ తొమ్మిది రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు, నియమనిబంధనలు పాటిస్తూ అమ్మవారిని కొలుస్తారు.
ముస్తాబైన దుర్గామాత మండపాలు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నియోజకవర్గ పరిధిలోని కారేపల్లి, జూలూరుపాడు, వైరా, ఏన్కూర్, కొణిజర్ల మండలాలలో గల పలు గ్రామాలలో నిర్వాహకులు మండపాలను ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేశారు. పలు ప్రాంతాల్లో అష్టాదశ శక్తిపీఠాలను పూజకోసం ఏర్పాటు చేశారు. భక్తులు ఆకర్షించేలా దేవీ మండపాలను అలంకరించారు.
ఉత్సవాలకు సిద్ధమైన దేవీ ఆలయాలు
వైరా నియోజకవర్గ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాల కోసం దేవీ ఆలయాలు సిద్ధమయ్యాయి. అమ్మవారిని రోజుకో రూపంలో దర్శించడానికి వీలుగా అలంకరణలతో ఆలయ పూజారులు తగిన ఏర్పాట్లు ముందుగానే ప్రణాళిక ప్రకారం చేసుకున్నారు. నైవేద్యం, చీరలను ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా ఆలయ కమిటీలు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కారేపల్లి మండలంలోని కోట మైసమ్మ తల్లి, కాళికామాత, పెద్దమ్మ తల్లి ఆలయాలతో సహా మిగతా మండలాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు జరుపుటకు కమిటీలు ఏర్పాట్లు చేశాయి.
విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని కారేపల్లి సీఐ తిరుపతిరెడ్డి సూచించారు. నిర్వాహకులు పలు నియమాలను పాటించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. విగ్రహ ఏర్పాటుకు ప్రజల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయరాదన్నారు. దుర్గామాత విగ్రహ మండపాల సందర్శనకు వచ్చే మహిళలు, యువతులపై ఈవ్‌టీజింగ్ జరగకుండ చూసుకోవాలన్నారు. లౌడ్‌స్పీకర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. డీజేలు పూర్తిగా నిషేధించామని తెలిపారు. మైక్ పర్మీషన్ కోసం సంబంధిత పరిధిలో గల ఏసీపీ స్థాయి అధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు.