లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. అదనపు కట్నం (Dowry Dispute) తేలేదని కోడలిని గదిలో బంధించిన అత్తమామలు.. అందులో పామును వదిలారు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
కలోనల్గంజ్కు చెందిన రేష్మకు 2021, మార్చి 19న షానవాజ్ అనే వ్యక్తి పెండ్లి అయింది. కొన్ని రోజులకే కట్నం కోసం అత్తగారింట్లో వెధింపులు మొదలయ్యాయి. భర్తతోపాటు అత్తమామలు ఆమెను చిత్ర హింసలకు గురుచేస్తుండటంతో.. రేష్మ తల్లిదండ్రులు రూ.1.5 లక్షలు కట్నంగా చెల్లించారు. అయితే మరో రూ.5 లక్షలు అదనపు కట్నం చెల్లించాలని డిమాండ్ చేశారు. దానికోసం ఆమెపై అత్తింటివారి వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. ఏండ్లు గడుస్తున్న ఆ మొత్తం ఇవ్వకపోవడంతో ఆమెను వదిలించుకోవాలనుకున్నారు. తప్పు తమ మీదికి రాకుండా ఓ ప్లాన్ వేశారు.
అందులో భాగంగా ఈ నెల 18న రేష్మను ఓ గదిలో బంధించారు. అనంతరం డ్రైన్ పైపు గుండా గదిలోకి పామును వదిలారు. అది ఆమె కాలుపై కాటు వేసింది. నొప్పి తాళలేక తలుపులు తీయాలని వేడుకున్నా భర్తతోపాటు అత్తమామలు స్పందించేదు. దీంతో ఎదోఒకలా తన సోదరి రిజ్వానాకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. అక్కడికి చేరుకున్న ఆమె రేష్మను దవాఖానకు తీసుకెళ్లింది. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అత్తింటివారిపై హత్యా యత్నంతోపాటు గృహహింస కేసు నమోదుచేశారు.