మామిళ్లగూడెం, సెప్టెంబర్ 21: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు అవసరమైన ఇసుకను శాండ్బజార్ల ద్వారా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణాల అవసరాలకు తగినంత ఇసుక అందుబాటులో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని కూసుమంచి, మధిర, కామేపల్లి, సత్తుపల్లి, ఖమ్మంలలో శాండ్బజార్లను ఏర్పాటు చేశామన్నారు.
ఈ శాండ్బజారుల్లో ఇప్పటివరకు 5,194 మెట్రిక్ టన్నుల ఇసుక ఉందని, దీనిలో 634 మెట్రిక్ టన్నుల ఇసుక వివిధ అవసరాలకు సరఫరా చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 1100 రూపాయలకే మెట్రిక్ టన్ను ఇసుక అందిస్తున్నామని తెలిపారు. కూసుమంచి శాండ్బజార్లో 424 మెట్రిక్ టన్నులు, మధిరలో 1,164 మెట్రిక్ టన్నులు, కామేపల్లిలో 832 మెట్రిక్ టన్నులు, ఖమ్మంలో 1500 మెట్రిక్ టన్నులు, సత్తుపల్లిలో 640 మెట్రిక్ టన్నులు ఇసుక నిల్వలు ఉన్నాయని వివరించారు. ఇసుక రీజ్లను మహిళా సంఘాలకు కేటాయించినట్లు తెలిపారు.
సకాలంలో యూరియా పంపిణీ
రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేశామని కలెక్టర్ అనుదీప్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాకు అవసరమైన 45,678 మెట్రిక్ టన్నుల యూరియాలో 41,000 మెట్రిక్ టన్నులు కేటాయించగా ఇప్పటివరకు 32,494 మెట్రిక్ టన్నులు రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 76 పీఏసీఎస్‌లు, 26 ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, 446 ప్రైవేటు డీలర్ల ద్వారా పంపిణీ జరుగుతున్నదని తెలిపారు. రైతుల సౌకర్యం కోసం 66 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.