హైదరాబాద్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని నారపల్లిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య (Engineering Student) చేసుకున్నారు. అతని బలవన్మరణానికి ర్యాగింగే కారణమని స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన జాదవ్ సాయితేజ (19) నారపల్లిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. అక్కడే ఓ హాస్టల్ ఉంటున్నాడు. ఇటీవల అతనికి సీనియర్ విద్యార్థులతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సాయితేజ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు.
అయితే ర్యాగింగ్ వల్లే సాయితేజ చనిపోయాడని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సీనియర్లు అతడిని మద్యం తాగమని ఒత్తిడి చేసి, బార్‌కు తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ వచ్చిన రూ.10 వేల బిల్లును కట్టాలని మరింత ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న సాయితేజ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ర్యాగింగ్ వల్లే చనిపోయాడా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ఆరాతీస్తున్నారు.