ఎన్నికల సమయంలో యువత ఓట్లను రాబట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 పథకాల పేరుతో ప్రచారాన్ని ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్నది. అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలతోపాటు ఆర్థిక సాయం కోసం రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధిరంగాలను బలోపేతం చేస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. కానీ అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా యువతకు ఇచ్చిన హామీలను పట్టించుకున్న పాపాన పోవడంలేదు. రెండు లక్షల ఉద్యోగాల మాట దేవుడెరుగు.. స్వయం ఉపాధి కల్పిస్తామని యువత నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ సర్కార్ కనీసం వాటిని కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా యువతను ఓటర్లుగా మాత్రమే తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేసి.. దగా సర్కార్‌గా పాలన కొనసాస్తున్నది.
– మామిళ్లగూడెం, సెప్టెంబర్ 21
‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను నిట్టనిలువునా మోసం చేసింది. స్వయం ఉపాధిరంగాన్ని బలోపేతం చేసి యువతను లక్షాధికారులను చేస్తామని చెప్పి మాయ చేసింది. నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని సద్దుమణిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల కార్పొరేషన్ల ద్వారా 2025 మార్చిలో దరఖాస్తులు స్వీకరించింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రుణాలు మంజూరు చేస్తామని మాయమాటలు చెప్పి మోసానికి తెరలేపింది. దీంతో కోటి ఆశలు పెట్టుకున్న యువత ఖమ్మం జిల్లావ్యాప్తంగా 95,325 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
వచ్చిన దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాల్టీల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ చేసి తుది జాబితాలను సిద్ధం చేశారు. వీరికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా రుణాలు మంజూరు చేస్తామని యువత సిద్ధంగా ఉండాలని అధికారుల ద్వారా సమాచారం పంపించారు. కానీ ఏమి జరిగిందో తెలియదు 2025 జూన్ 2వ తేదీన తమకు రుణాలు మంజూరు పత్రాలు అందిస్తారని ఎదురుచూసిన యువత కంట్లో కారం చల్లినట్లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువత ఆందోళన బాట పట్టారు.
వెంటనే మేల్కొన్న సర్కార్ మరో మోసపు ప్రకటనకు తెరలేపింది. 2025 ఆగస్టు 15వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు మంజూరు చేస్తామని తిరిగి ప్రకటనలు జారీ చేసింది. అప్పటిలోగా దరఖాస్తులు చేసుకున్న యువత ఆయారంగాల్లో నైపుణ్యాలు సాధించాలని, ఎంచుకున్న వ్యాపారం మీద అవగాహన కలిగి ఉండాలని ఉచిత సలహా ఇచ్చింది. స్వయం సహాయ సంఘాలు, నిపుణులతో శిక్షణ సైతం అందిస్తామని ప్రకటించినప్పటికీ శిక్షణ లేదు.. ఏమీలేదు. సెప్టెంబర్ చివరినాటికీ రుణాలు మంజూరు చేయకపోవడంతో యువత నైరాశ్యంలో మునిగిపోయింది. నాటినుంచి మొన్న జరిగిన ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ 17న అయినా తమ దరఖాస్తులకు మోక్షం లభిస్తుందనే ఆశలతో ఎదురుచూసిన యువత ఆశలపై కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నీళ్లు చల్లింది.
కార్పొరేషన్ల వారీగా వచ్చిన దఖాస్తులు..