హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కావలి రామచందర్ ముదిరాజ్ చేపట్టిన పాదయాత్ర బుధవారం ముగిసింది. నారాయణపేట నియోజకవర్గం కోయిల్‌కొండ మండలం అంకిల్ల గ్రామానికి చెందిన రామచందర్ తన స్వగ్రామం నుంచి తెలంగాణభవన్ వరకు పాదయాత్ర చేపట్టారు. నాలుగు రోజులపాటు 140 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆయనను తెలంగాణభవన్‌లో ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆ రైతుల కష్టాలు తొలగిపోతాయనే విశ్వాసంతో తాను ఈ పాదయాత్ర చేసినట్టు రామచందర్ ముదిరాజ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే కావాలని ఆయన ఆకాంక్షించారు.