ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ అధికారులు, సిబ్బంది వ్యవహారశైలి ప్రైవేట్ వ్యాపారులకు వరంగా మారింది. జిల్లాలో 4.31 లక్షల ఎకరాల్లో వానకాలంలో రైతులు సాగు చేయగా 30 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని అంచనా వేసినా అధికారులు 11 సీసీఐ కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టారు. ఇప్పటివరకు 15 లక్షల క్వింటాళ్లు మాత్ర మే సేకరించి, ఈ నెల 27 నుంచి కొనుగోళ్లను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో రైతులు భారీగా పంటను విక్రయించడానికి సీసీఐ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,010తో పత్తిని కొనుగోలు చేయాల్సిన సీసీఐ అధికారులు నాణ్యత సరిగా లేదంటూ తిరస్కరిస్తున్నారు. దీంతో దిక్కులేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తూ క్వింటాల్‌కు రూ.1,500 నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.