అశ్వారావుపేట టౌన్, సెప్టెంబర్ 21: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆదివాసీలు చేపట్టిన ‘పోరుగర్జన’తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణ వీధులు జనసంద్రంగా మారాయి. అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది జాతుల ఆదివాసీలు ఈ పోరుగర్జనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీశ్రీ కళ్యాణ మండపం వద్ద ప్రారంభమైన భారీ ర్యాలీ డప్పు వాయిద్యాలు, కొమ్ము నృత్యాలతో రింగ్‌రోడ్డు వరకు సాగింది.
చట్టబద్దతలేని లంబాడీ, సుగాలి, బంజార జాతులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం రింగ్‌రోడ్డులో మహాసభ నిర్వహించారు. స్వాతంత్య్రం వచ్చి ఎనభై ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ గిరిజన జాతులను పాలకులు మోసం చేస్తూనే ఉన్నారని నాయకులు గళమెత్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్‌ల్లో గిరిజన జాతులకు ఎంత వాటా కేటాయిస్తున్నారనే విషయం ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు. వలస జాతులైన లంబాడీలు, సుగాలి, బంజార జాతులవారు ఆదివాసీలకు చేరకుండా అడ్డుకుంటున్నాయని ఇటువంటి జాతులను ఎస్టీ జాబితాల నుంచి పూర్తిగా తొలగించినప్పుడే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు.